![]() |
AP Board Class 9 Telugu Chapter 9 భూమి పుత్రుడు Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 9th Telugu Chapter 9 భూమి పుత్రుడు Book Answers |
Andhra Pradesh Board Class 9th Telugu Chapter 9 భూమి పుత్రుడు Textbooks Solutions PDF
Andhra Pradesh State Board STD 9th Telugu Chapter 9 భూమి పుత్రుడు Books Solutions with Answers are prepared and published by the Andhra Pradesh Board Publishers. It is an autonomous organization to advise and assist qualitative improvements in school education. If you are in search of AP Board Class 9th Telugu Chapter 9 భూమి పుత్రుడు Books Answers Solutions, then you are in the right place. Here is a complete hub of Andhra Pradesh State Board Class 9th Telugu Chapter 9 భూమి పుత్రుడు solutions that are available here for free PDF downloads to help students for their adequate preparation. You can find all the subjects of Andhra Pradesh Board STD 9th Telugu Chapter 9 భూమి పుత్రుడు Textbooks. These Andhra Pradesh State Board Class 9th Telugu Chapter 9 భూమి పుత్రుడు Textbooks Solutions English PDF will be helpful for effective education, and a maximum number of questions in exams are chosen from Andhra Pradesh Board.Andhra Pradesh State Board Class 9th Telugu Chapter 9 భూమి పుత్రుడు Books Solutions
Board | AP Board |
Materials | Textbook Solutions/Guide |
Format | DOC/PDF |
Class | 9th |
Subject | Maths |
Chapters | Telugu Chapter 9 భూమి పుత్రుడు |
Provider | Hsslive |
How to download Andhra Pradesh Board Class 9th Telugu Chapter 9 భూమి పుత్రుడు Textbook Solutions Answers PDF Online?
- Visit our website - Hsslive
- Click on the Andhra Pradesh Board Class 9th Telugu Chapter 9 భూమి పుత్రుడు Answers.
- Look for your Andhra Pradesh Board STD 9th Telugu Chapter 9 భూమి పుత్రుడు Textbooks PDF.
- Now download or read the Andhra Pradesh Board Class 9th Telugu Chapter 9 భూమి పుత్రుడు Textbook Solutions for PDF Free.
AP Board Class 9th Telugu Chapter 9 భూమి పుత్రుడు Textbooks Solutions with Answer PDF Download
Find below the list of all AP Board Class 9th Telugu Chapter 9 భూమి పుత్రుడు Textbook Solutions for PDF’s for you to download and prepare for the upcoming exams:9th Class Telugu 9th Lesson భూమి పుత్రుడు Textbook Questions and Answers
చదవండి-ఆలోచించండి-చెప్పండి
మనిషి జీవించడానికి ముఖ్యంగా కావలసినవి తినడానికి తిండి, కట్టుకోడానికి బట్ట, నివసించడానికి ఇల్లు – ఈ మూడు అవసరాలు తీరాలంటే ప్రకృతిలోని మొక్కలు, చెట్లే ఆధారం. అవి ఎక్కడెక్కడో చెల్లాచెదురుగా ఉంటే వాటి నుంచి తమ అవసరాలు తీర్చుకొనేవాడు ఆదిమానవుడు. కాలక్రమేణ మానవ అవసరాలు ఎక్కువ కావడంతో, ఆయా మొక్కలను, చెట్లను ప్రత్యేకంగా పెంచడం మొదలుపెట్టాడు. దానికి వ్యవసాయం అని పేరు పెట్టాడు. రాను రాను ఆ వ్యవసాయం ప్రధాన వృత్తిగా మారింది. దాని ఆధారంగా మానవుడి నాగరికత కూడా పెరిగింది.
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
మనిషికి కావలసిన ముఖ్యావసరాలు ఏవి?
జవాబు:
మనిషికి ముఖ్యంగా కావలసినవి మూడు :
- తినడానికి తిండి
- కట్టుకోవడానికి బట్ట
- నివసించడానికి ఇల్లు.
ప్రశ్న 2.
ఆదిమానవుడు మొదట్లో తన అవసరాలను ఎలా తీర్చుకొనేవాడు?
జవాబు:
ప్రకృతిలో ఎక్కడెక్కడో చెల్లాచెదురుగా ఉండే మొక్కలు, చెట్ల నుండి ఆదిమానవుడు తన అవసరాలను తీర్చుకొనేవాడు.
ప్రశ్న 3.
వ్యవసాయం ఎలా మొదలయింది?
జవాబు:
మానవ అవసరాలు ఎక్కువ కావడంతో మానవుడు ఆయా చెట్లనూ, మొక్కలనూ ప్రత్యేకంగా పెంచడం మొదలుపెట్టాడు. దానికి ‘వ్యవసాయం’ అని పేరు పెట్టాడు. వ్యవసాయం ఆ విధంగా మొదలయ్యింది.
ప్రశ్న 4.
వ్యవసాయం వలన ఏమి పెరిగింది?
జవాబు:
వ్యవసాయం వలన మానవుడి ‘నాగరికత’ కూడా పెరిగింది.
ప్రశ్న 5.
వ్యవసాయం చేసేవారిని ఏమని పిలుస్తారు?
జవాబు:
వ్యవసాయం చేసేవారిని కర్షకులు, రైతులు, సేద్యగాండ్రు అని పిలుస్తారు.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
అ) కింది అంశాలను గురించి మాట్లాడండి.
ప్రశ్న 1.
పద్యాలను భావయుక్తంగా పాడండి.
జవాబు:
మీ గురువుల సాయంతో రాగయుక్తంగా, భావం తెలిసేటట్లు చదవడం నేర్చుకోండి.
ప్రశ్న 2.
ఈ పాఠానికి ‘భూమి పుత్రుడు’ అనే శీర్షిక తగినట్లు ఉన్నదా? ఎందుకు? చర్చించండి.
జవాబు:
సామాన్యంగా రచనలోని విషయాన్ని కొంతవరకు ఊహించగలిగిన విధంగా, వివరించగలిగిన దానిగా, ‘శీర్షిక’ ఉండాలి. శీర్షిక అంటే పాఠం పేరు. ఈ పాఠంలో రామిరెడ్డిగారు రైతును గురించి, అతడు భూమిని దున్ని చేసే వ్యవసాయం గురించి చర్చించారు. పుత్రుడు తండ్రి ఆస్తిని అనుభవించడానికి పూర్తి హక్కు కలిగి ఉంటాడు. భూమి పుత్రుడు అంటే కర్షకుడు లేక రైతు. భూమిని పూర్తిగా అనుభవించే అర్హత గలవాడు. రైతు పంటలు పండించి, సమాజంలోని ఇతర సోదరులు అందరికీ తిండి పెడుతున్నాడు కాబట్టి రైతులను గురించి చెప్పిన ఈ పాఠానికి “భూమి పుత్రుడు” అనే పేరు సరిపోతుంది.
ఆ) కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
తన పంచన చేరిన అతిథిని రైతు ఎలా ఆదరిస్తున్నాడు?
జవాబు:
రైతు తాను తిన్నా తినకపోయినా, తన పంచకు ఆకలితో వచ్చిన అతిథికి కడుపునిండా తిండి పెట్టి, త్రాగడానికి నీరు ఇస్తాడు. ఏ ఒక్క అతిథినీ రైతు నిరాశపరచడు.
ప్రశ్న 2.
కవి రైతును ఏమి తెలుసుకోమంటున్నాడు?
జవాబు:
రైతు ఎప్పుడూ కష్టాల కన్నీళ్ళలో కూరుకుపోవాలని ఎవరూ శాసించలేరనీ, రైతుకు ఏమీ లోటు లేదనీ, రైతు గొప్పదనాన్ని రైతు తెలుసుకోవాలని రామిరెడ్డి గారు చెప్పారు. రైతు తన గొప్పదనాన్ని తాను తెలుసుకోవాలని చెప్పారు.
ప్రశ్న 3.
ఈ పాఠంలోని జాతీయాలను, సామెతలను గుర్తించి వివరించండి.
జవాబు:
ఈ పాఠంలో కింది జాతీయాలు, సామెతలు ఉన్నాయి.
1) పిండికొద్ది రొట్టె:
మనం చేసిన కృషికి తగిన విధంగానే ఫలితం ఉంటుందని భావం. మనం ఎక్కువ పిండి వేస్తే పెద్ద రొట్టె తయారవుతుంది. కొద్ది పిండి వేస్తే చిన్న రొట్టె తయారవుతుందని అర్థం.
2) బోడితలకు, మోకాళ్ళకు ముడులు పెట్టు :
ఏదో సంబంధం లేని మాటలు చెప్పడం అని అర్థం. వారు చెప్పే మాటల్లో పొంతన, అతుకు లేదని అర్థం. మోకాళ్ళమీద, బోడి తలమీద వెంట్రుకలు ఉండవు. నున్నని గుండుకూ, మోకాలికీ ముడివేయడం జరిగే పని కాదని అర్థం. అసంబద్ధమైన మాటలని సారాంశం.
3) చిటికెల పందిళ్ళు పన్ను :
ఇంత చేస్తాము అంత చేస్తాము అని అతిడంబపు మాటలు మాట్లాడడం అని అర్థం. తాము చిటికె చప్పుడు చేసే పని అయిపోతుందని గొప్పలు చెప్పడం అని భావం. మాటలతో మభ్యపెట్టడం అని అర్థం.
4) నేల నూతులకు ఉగ్గాలు నిలుపుట :
కొన్ని ప్రాంతాల్లో దిగుడు బావులు ఉంటాయి. దానిలోకి ప్రక్కనున్న మెట్ల ద్వారా దిగి, నీరు పైకి తెచ్చుకోవాలి. నేలనూతుల నుండి మామూలు నూతులలోకి వలె చేదకు త్రాడుకట్టి తోడుకోవడం సాధ్యం కాదు. కానీ కొందరు అసాధ్యమైన కార్యములు చేస్తామని గొప్పలు చెపుతారు. అలాంటి వారిని గూర్చి ఈ మాట అంటారు.
5) ఉత్తయాసలకన్న మేలుద్యమంబు :
అది కావాలి ఇది కావాలి అని కేవలం కోరుకుంటూ కూర్చోడం కన్న, ఆ కావలసిన వాటి కోసం, ‘ఉద్యమంబు’ అంటే ప్రయత్నం చేయడం మంచిదని భావం.
6) సిరియె భోగోపలకి ‘జీవగట్టి’ :
‘జీవగట్టు’ అన్నది జాతీయము. జీవన ఔషధం అని భావం. ‘అతిముఖ్యం’ అని సారాంశము. భోగాలు పొందాలంటే సిరిసలఎదలు ముఖ్యంగా కావాలని భావం.
ప్రశ్న 4.
పాఠం ఆధారంగా రైతు గుణగణాలను రామిరెడ్డి గారు ఏయే విశేషణాలతో వర్ణించారో రాయండి.
జవాబు:
“రైతు”
- భారత క్ష్మాతల ఆత్మగౌరవ పవిత్రమూర్తి.
- శూరమణి
- ప్రొద్దుపొడిచినది మొదలుకొని ప్రొద్దు క్రుంకు వఱకూ కష్టిస్తాడు.
- ఇరుగు పొరుగు వారి సంపదకై ఈర్ష్య చెందడు
- పరుల కష్టార్జితానికి ఆశపడడు.
- తాను తిన్నా తినకున్నా, అతిథులకు లేదనకుండా తృప్తిగా పెడతాడు.
- సాంఘిక ఉత్కృష్ట సౌభాగ్య సౌఖ్యాలకు రైతు కారకుండు.
- తన కష్టాన్ని గుర్తించని కృతఘ్నులను రైతు పట్టించుకోడు.
- తన కాయకష్టాన్నే నమ్ముకొని, తన శరీర శ్రమతో లభించిన పట్టెడన్నాన్నే తింటాడు.
ఇ) పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి.
అంశం | చేపట్టిన పని / ఫలితం |
సమాజ నిర్మాణం, సంక్షేమం కోసం | వ్యవసాయ వృత్తిని చేపట్టడం. “లోకహితం” దాని ఫలితం. |
శ్రమ చేయడం వల్ల | ఫలములు సిద్ధిస్తాయి. |
పరిశ్రమలకు ప్రధాన వనరు | “వ్యవసాయం”. |
విజయం సాధించాలంటే | శౌర్యము, విద్య, బుద్ధి, సత్యసంధత, ఆత్మ విశ్వాసం విడువరాదు. |
ఈ) కింది పేరాను చదవండి. కారణాలు రాయండి.
“ఏటి కేతంపట్టి ఎయి పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా ! నేను గంజిలో మెతుకెరుగనన్నా!” అని ఒక కవి పాట రూపంలో రైతు దుస్థితిని తెలియజేశాడు. వ్యవసాయానికి కావలసిన ముఖ్యమైన వనరులు భూమి, నీరు, దానితోపాటు ఎరువులు, వాతావరణ పరిస్థితులు అనుకూలించడం కూడా అవసరమే. జనాభా పెరగకముందు పై వనరులన్నీ పుష్కలంగా ఉండేవి. రానురాను జనాభా పెరిగిపోయింది. మానవుడి అవసరాలూ పెరిగిపోయాయి. వీటన్నిటికీ భూమే ఆధారం. ఇతర అవసరాలకోసం భూమి వినియోగం ఎక్కువ కావడం లాంటి పరిస్థితులవల్లనే వ్యవసాయరంగానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులు ఎన్నో ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ రంగానికి ఉన్న వనరుల కొరత, ఇబ్బందుల వల్ల దిగుబడి ఆశాజనకంగా లేదు.
1. కవి పాట రాయడానికి కారణం : రైతు దుస్థితిని తెలియజేయడానికి.
2. వ్యవసాయ వనరులు తగ్గడానికి కారణం : జనాభా పెరిగిపోవడం.
3. వ్యవసాయ రంగానికి ఇబ్బందులకు కారణం : ఇతర అవసరాల కోసం భూమి వినియోగం ఎక్కువ కావడం.
4. దిగుబడి తగ్గడానికి కారణం : వ్యవసాయ రంగానికి ఉన్న వనరుల కొరత. ఇబ్బందులు.
II. వ్యక్తీకరణ సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సొంతమాటల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘సుఖాల కన్నిటికీ ధనమే మూలం’ అని కవి ఎందుకన్నాడు?
జవాబు:
సుఖాలు పొందాలంటే ధనం ఉండాలని కవి చెప్పాడు. ‘సిరియె భోగోపలబ్దికి జీవగట్టు’ అన్నాడు. నిజమే ‘ధనమూలమ్ ఇదం జగత్’ – అని పెద్దలు చెప్పారు. ఈ లోకమంతా డబ్బుమూలంగానే నడుస్తుంది. మన దగ్గర ధనం ఉంటేనే కావలసిన టి.వి, ఫ్రిజ్, పట్టుబట్టలు, కారు, మోటారు సైకిలు వగైరా కొనుక్కుని సుఖంగా జీవించగలం. కావలసిన వస్తువులు కొని తినగలం. కాబట్టి కవి చెప్పినట్లు సుఖాలు పొందాలంటే ధనం అవసరం అన్నది సత్యం.
ప్రశ్న 2.
“పిండికొద్దీ రొట్టె” అనడంలో కవి ఉద్దేశమేమి?
జవాబు:
పిండి వాడిన దానిని బట్టి రొట్టె పరిమాణం ఉంటుంది. ఎక్కువ పిండి వేసి కాలిస్తే పెద్ద రొట్టె తయారవుతుంది. కొంచెమే పిండి వేస్తే చిన్న రొట్టె తయారవుతుంది. అలాగే, మనం పడిన శ్రమను బట్టి ఫలితాలు ఉంటాయి. శ్రమలు లేకుండా ఫలములు రావు. కష్టపడితే సుఖం కలుగుతుంది. మనం పడిన శ్రమను బట్టే మనకు వచ్చే ఫలితం ఆధారపడి ఉంటుంది అని భావం.
ప్రశ్న 3.
‘రైతు హృదయం నిర్మలమైనది’ దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
రైతు కేవలం తన నిత్యావసరాలు గడచిపోతే చాలని చూస్తాడు. అతడు తన ఊహలనూ, ఆలోచనలనూ, నైపుణ్యాన్ని అన్నింటినీ పంటలు పండించడానికే వినియోగిస్తాడు. రైతు రోజంతా కష్టపడతాడు – ప్రక్కవారి సంపదలను గూర్చి ఆశపడడు. రైతు తాను తిన్నా, తినకపోయినా తన ఇంటికి వచ్చిన అతిథికి కడుపునిండా తృప్తిగా పెడతాడు. పైన చెప్పిన రైతు గుణగణాలను చూస్తే అతడి హృదయం నిర్మలమైనదని నా అభిప్రాయం.
ప్రశ్న 4.
‘పాలనాదండం’ కంటే ‘హలం’ గొప్పదని కవి ఎందుకన్నాడు?
జవాబు:
దేశాన్ని పాలించే రాజు చేతిలో పాలనా దండం ఉంటుంది. భూమిని దున్ని పంటలు పండించే రైతు చేతిలో ‘హలం’ ‘అనగా ‘నాగలి’ ఉంటుంది. రాజు తన పాలనా దండంతో తప్పు చేసిన వారిని దండిస్తాడు. రైతు తన చేతిలోని నాగలితో పంటలు పండిస్తాడు. దేశ ప్రజలందరికీ రైతు తిండి పెడతాడు. కాబట్టి రాజు ప్రజలను శిక్షించడానికి ఉపయోగించే పాలనా దండము కన్నా, రైతు పంటలు పండించి పదిమందికీ కడుపు నింపేందుకు ఉపయోగించే హలం గొప్పది అని కవి అన్నాడు.
ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి వాక్యాల్లో సొంతమాటల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
కర్షకుని గొప్పతనాన్ని గురించి కవి ఏమని చెప్పాడు?
జవాబు:
వ్యవసాయ వృత్తి వృత్తులన్నిటిలో గొప్పది. కర్షకుడు భారతదేశ ఆత్మగౌరవాన్ని ప్రకటించే పవిత్రమూర్తి. రాజదండం కన్నా, రైతు చేతి హలం గొప్పది. కర్షకుడు నిత్యావసరాలు గడచిపోతే చాలని చూస్తాడు. అంతకు మించి ఆశలు పెట్టుకోడు. కర్షకుడు తన ఊహలనూ, ఆలోచనలనూ, నైపుణ్యాన్ని పంటలను పండించడానికే వినియోగిస్తాడు.
కర్షకుడు రోజంతా కష్టపడతాడే గాని, ప్రక్క వారి సంపదలను గూర్చి అసూయపడడు. కర్షకుని మనస్సు నిర్మలమైనది. తాను తిన్నా తినకున్నా ఇతరుల కష్టార్జితానికై ఆశపడడు. ఆకలితో తన ఇంటికి వచ్చిన అతిథికి కడుపునిండా పెడతాడు.
కర్షకుడు చేపట్టిన వ్యవసాయమే పరిశ్రమలన్నిటికీ మూలం. పరిశ్రమల వల్లనే సంపదలూ, సంపదల వల్లనే సుఖం లభిస్తుంది. సమాజం సుఖసంతోషాలతో ఉండడానికి కర్షకుడే కారణం.
కర్షకుని కష్టఫలితాన్ని ఇతరులు అనుభవించి సుఖపడుతున్నారు. కర్షకుడు తాను చేసిన మేలును మరచిన కృతఘ్నులను పట్టించుకోడు. వ్యవసాయం చేయడంలో తన శరీరం ఎముకల గూడుగా మారినా, వానలు ముంచెత్తినా, కరవులు వచ్చినా అతడు లెక్కచేయడు. తన కాయకష్టాన్నే నమ్ముకొంటాడు. అతడు తన శరీరశ్రమతో లభించిన పట్టెడన్నం తిని, తృప్తిపడతాడు.
ప్రశ్న 2.
పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
(లేదా)
భూమి పుత్రుడైన రైతు సుఖదుఃఖాలను కవి ఏ విధంగా విశ్లేషించారో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
వ్యవసాయము వృత్తులలోకెల్లా ఉత్తమమైనది. ప్రపంచానికి మేలు చేయడం కోసం, కర్షకులు వ్యవసాయం చేస్తున్నారు. కర్షకులకు ఎవరూ సాటిరారు. హాలికుడు భారతదేశం ఆత్మ గౌరవాన్ని తెలిపే పవిత్రుడు. రాజదండం కన్నా రైతు నాగలి గొప్పది. రైతు ఎక్కువగా ఆశించడు. రోజూ ఖర్చులు వెళ్ళిపోతే చాలు అనుకుంటాడు. కర్షకుడు ప్రక్కవారి సంపదలకు అసూయపడడు. రైతు మనస్సు స్వచ్ఛమైనది.
కర్షకుడు తాను తిన్నా తినకపోయినా, అతిథులకు తప్పక పెడతాడు. వ్యవసాయం వల్లనే, సంపదలు లభిస్తాయి. సమాజ సుఖసంతోషాలకు హాలికుడే కారణం. హాలికుని కష్ట ఫలితాన్ని ఇతరులు అనుభవిస్తున్నారు. రైతుకు మాత్రం తిండికీ, బట్టకూ ఎప్పుడూ కఱవే.
రైతు కష్టంతో భోగాలు అనుభవించే వారు రైతును కన్నెత్తియైనా చూడరు. కర్షకుడు అటువంటి కృతఘ్నులను పట్టించుకోడు. వ్యవసాయం చేయడంలో తన శరీరం ఎముకల గూడుగా మారినా, వర్షాలు వచ్చినా, కఱవు వచ్చినా పట్టించుకోడు. రైతు తన కాయకషాన్నే నమ్ముకొని, తన శరీర శ్రమతో లభించిన పట్టెడన్నాన్నే తింటాడు.
అందుకే కవి “ఓ కర్మకా! నీ గూర్చి నీవు తెలిసికోవాలి. శ్రమను నమ్ముకొన్నవాడు, ఎన్ని ఆటంకాలనైనా దాటుతాడు. జీవిత యుద్ధంలో విజయానికి శక్తి, తెలివి, చదువు, సత్యము, ఆత్మవిశ్వాసము అనే ఆయుధాలు ధరించి ముందుకు నడు” అని బోధిస్తున్నాడు.
ఇ) సృజనాత్మకంగా సమాధానం రాయండి.
*నేడు గ్రామాలలో వ్యవసాయం చేసేవారు తగ్గుతున్నారు. భవిష్యత్తులో పంటలు పండించేవారు కరువైతే, ఆహారం దొరకడం గగనమవుతుంది. కోటీశ్వరుడైనా ఆకలికి అన్నమే తింటాడు కాని బంగారాన్ని తినడు కదా ! కాబట్టి వ్యవసాయం చేసే రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, సాగుకవసరమైన ప్రత్యేక ఋణ సౌకర్యం సకాలంలో అందించే బాధ్యత చేపట్టాలని వ్యవసాయాధికారికి లేఖ రాయండి.
జవాబు:
మండపేట, జిల్లా వ్యవసాయాధికారి గార్కి, విషయం : రైతుల అవసరాలను తీర్చే బాధ్యత తీసుకోవాలని కోరిక. మా మండపేట భూములలో ఏటా రెండు పంటలు పండుతాయి. మా తాత ముత్తాల నుండి మేము వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నాము. క్రమక్రమంగా మా రైతుల జీవితం దుఃఖనిలయం అవుతోంది. మాకు కావలసిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సక్రమమైన ధరలకు దొరకట్లేదు. స్థానిక వర్తకులు వాటిని దాచి, కృత్రిమంగా కొరతను సృష్టిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని ఎవరూ కొనడం లేదు. ఇప్పుడు రెండవ పంటకు పెట్టుబడి దొరకడం లేదు. బ్యాంకులకు ఎన్నిసార్లు వెళ్ళినా మేము ఉత్త చేతులతో తిరిగి రావలసి వస్తోంది. విద్యుచ్ఛక్తి కనీసం మూడు గంటలయినా రావడంలేదు. మేము పంటలు పండించకపోతే ప్రజలు పస్తులు ఉండాలి. ప్రజలకు చేతిలో ఎంత డబ్బు ఉన్నా తిండి గింజలే తింటారు కదా. మీరు శ్రద్ధ చూపించి, మాకు అప్పులు దొరికేలా, ఎరువులు, విత్తనాలు సరయిన ధరలకు దొరికేలా చర్యలు వెంటనే చేపట్టండి. వ్యవసాయాన్ని బ్రతికించండి. సెలవు. నమస్కారములు. ఇట్లు, చిరునామా: |
ఈ) ప్రశంసాపూర్వకంగా సమాధానం రాయండి.
రైతు కృషి వల్లనే మనకు ఆహారం లభిస్తున్నది కదా! రామయ్య ఆదర్శరైతు. ఆధునిక పద్ధతులతో, సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడిని సాధించాడు. వ్యవసాయశాఖ తరఫున ఆయన్ను అభినందించాలనుకున్నారు. ఈ అభినందన సభ కోసం రామయ్యగారిని ప్రశంసిస్తూ అభినందన పత్రాన్ని తయారు చేయండి.
(లేదా)
ఆదర్శరైతు రామయ్యను ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి.
జవాబు:
అభినందన పత్రం అభ్యుదయ రైతురాజు రామయ్య మహాశయా! మీకు అభినందన మందారాలు. భారతదేశ సౌభాగ్యం పల్లెలపై ఆధారపడియుంది. పల్లెల్లో రైతులు పండించే పంటలపైనే మన వర్తక పరిశ్రమలు ఆధారపడియున్నాయి. మేం కడుపునిండా అన్నం తింటున్నామంటే అది మీ వంటి కర్షకోత్తముల హస్తవాసి అనే చెప్పాలి. కర్షకోత్తమా ! రైతురత్న రామయ్య గారూ! ఇట్లు, |
IV. ప్రాజెక్టు పని
మీ గ్రామంలోని మీకు తెలిసిన ఒక ఆదర్శరైతు వద్దకు లేదా వ్యవసాయ అధికారి వద్దకు వెళ్ళి ఆధునిక పద్ధతుల ద్వారా అధికోత్పత్తిని ఎలా సాధింపవచ్చో వివరాలు సేకరించండి. వివరాలు తరగతి గదిలో చదివి ప్రదర్శించండి.
జవాబు:
మీ గురువుల పర్యవేక్షణలో పై ప్రాజెక్టు పనిని నిర్వహించండి.
III. భాషాంశాలు
పదజాలం
అ) కింది ప్రకృతి వికృతులను జతపరచండి.
1. ఈర్ష్య | అ) కర్జం |
2. విజ్ఞానం | ఆ) సత్తు |
3. సుఖం | ఇ) ఆన |
4. కార్యం | ఈ) ఈసు |
5. ఆజ్ఞ | ఉ) సుగం |
6. సత్యము | ఊ) విన్నాణం |
జవాబు:
1. ఈర్ష్య | ఈ) ఈసు |
2. విజ్ఞానం | ఊ) విన్నాణం |
3. సుఖం | ఉ) సుగం |
4. కార్యం | అ) కర్జం |
5. ఆజ్ఞ | ఇ) ఆన |
6. సత్యము | ఆ) సత్తు |
ఆ) కింది వాక్యాలను అవగాహన చేసుకొని గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి.
1. ఉచితం కదా ! అని దేన్నీ వృథా చేయడం ఉచితం కాదు.
ఉచితం : (నానార్థాలు) 1) రుసుము లేనిది 2) తగినది
2. పండించిన ఫలానికి ధర ఉన్నప్పుడే రైతు ఫలం పొందగలడు.
ఫలం: (నానార్థాలు) 1) పండు 2) లాభం
3. నేడు ధరకు విపరీతంగా ధర పెరిగిపోయింది.
ధర : (నానార్థాలు ) 1) నేల 2) వెల.
4. ఆధునిక కాలంలో కృష్ణ చేయడానికి ఎవరూ కృష్ణ చేయడం లేదు.
కృషి : (నానార్థాలు) 1) వ్యవసాయం 2) ప్రయత్నము
5. వర్మం లేక ఈ వర్మం జలాశయాలు నిండలేదు.
వర్షం : (నానార్థాలు) 1) వాన 2) సంవత్సరము
ఇ) కింది పదాలకు సమానార్థక పదాలను రాయండి. వాటిని సొంతవాక్యాలలో ఉపయోగించండి.
ఉదా: మహిళ = స్త్రీ, ఉవిద, నారి
వాక్య ప్రయోగం : ఉవిద తన హక్కుల కోసం పోరాటంలో భాగంగా నార్తీలోకాన్ని చైతన్యపరచి మహిళ అంటే ఏమిటో నిరూపించుకుంటున్నది.
1. హలం : 1) నాగలి, 2) సీరము
వాక్య ప్రయోగం : సీరము గుర్తుతో, నాగలిని భుజాన ధరించి రామయ్య పోటీ చేశాడు.
2. హాలికుడు : 1) రైతు 2) కర్పకుడు 4) సైరికుడు
వాక్య ప్రయోగం : రైతు బాంధవుడైన వ్యక్తిని కర్షకులు తమ నాయకుడిగా ఎన్నుకొంటే సైరికుల క్షేమానికి అతడు కృషి చేస్తాడు.
3. పొద్దు : 1) సూర్యుడు 2) దినము 3) వేళ
వాక్య ప్రయోగం : ఈ దినము సూర్యుడు మబ్బులలో మునిగి, భోజనం వేళ దాటాక కనబడ్డాడు.
4. వృక్షం : 1) చెట్టు 2) తరువు
వాక్య ప్రయోగం : ఈ తరువుకు కొమ్మలు లేవు కాని, వృక్షం నిండా పళ్ళు ఉండడం వల్ల చెట్టు మీద కోతులు చాలా ఉన్నాయి.
5. సత్యం : 1) నిజం 2) యథార్ధము
వాక్య ప్రయోగం : సత్యం కదా అని, నిజం చెపితే, యథార్థంగా వాడు చిక్కులలో పడతాడు.
6. సంగ్రామం : 1) యుద్ధము 2) రణము
వాక్య ప్రయోగం : యుద్ధములో పాల్గొన్న సైనికుడు, సంగ్రామంలో ఉత్సాహం చూపితే రణములో విజయం సిద్ధిస్తుంది.
7. అతిథి : 1) ఆవేశికుడు 2) ఆగంతువు
వాక్య ప్రయోగం : ఆవేశికుడైన మహర్షి. ఊరివారందరికీ అతిథిగా ఉంటూనే, ఆగంతువులా సన్మానం పొందాడు.
8. సౌఖ్యం : 1) సుఖం 2) హాయి
వాక్య ప్రయోగం : సౌఖ్యంగా ఉంటుందని హాయిగా షికారుకు వెడితే అక్కడ చలిగాలితో సుఖం మాయమయ్యింది.
9. నుయ్యి : 1) కూపం 2) బావి
వాక్య ప్రయోగం : నుయ్యి కన్నా బావి గొప్పదంటారు కానీ, కూపం మరింత గొప్పది.
వ్యాకరణం
అ) కింది సంధులకు ఉదాహరణలు రాసి, సూత్రాలు కూడా రాయండి.
1. వృద్ధి సంధి – సూత్రం :
అకారానికి ఏ, ఐ లు పరమైతే ఐకారమూ; ఓ, ఔలు పరమైతే ఔకారమూ ఏకాదేశంగా వస్తాయి.
ఉదా :
1) జీవనైకపరిపాలన – జీవన + ఏకపరిపాలన – వృద్ధి సంధి
2) మహైశ్వర్యము = మహా + ఐశ్వర్యము – వృద్ధి సంధి
3) వనౌషధి = వన + ఓషధి – వృద్ధి సంధి
2. త్రిక సంధి సూత్రం :
1) ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు త్రికమనబడును.
2) త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
3) ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్ఛిక దీర్ఘంబునకు హ్రస్వంబగు.
ఉదా :
1) ఎక్కాలము = ఏ + కాలము – త్రికసంధి
2) ఎవ్వారు = ఏ + వారు – త్రికసంధి
3) ఇమ్మహర్షి = ఈ + మహర్షి – త్రికసంధి
4) అమ్మధురత్వము = ఆ + మధురత్వము – త్రికసంధి
3. గుణసంధి – సూత్రం:
అకారానికి ఇ, ఉ, ఋలు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశంబగు.
ఉదా :
1) భోగోపలబ్ధి = భోగ + ఉపలబ్ది – గుణసంధి
2) సాంఘికోత్కృష్ట = సాంఘిక + ఉత్కృష్ట – గుణసంధి
3) కష్టోత్కటము = కష్ట + ఉత్కటము – గుణసంధి
4) మహర్షి = మహా + ఋషి – గుణసంధి
5) మదేభము = మద + ఇభము – గుణసంధి
4. అత్వసంధి – సూత్రం:
అత్తునకు సంధి బహుళంబుగానగు.
ఉదా :
1) రామయ్య = రామ + అయ్య – అకారసంధి
2) పుట్టినిల్లు = పుట్టిన + ఇల్లు – అకారసంధి
3) సీతమ్మ = సీత + అమ్మ – అకార సంధి
4) మేనల్లుడు = మేన + అల్లుడు – అకారసంధి
5. ఇత్వసంధి – సూత్రం :
ఏమ్యాదుల ఇకారానికి సంధి వైకల్పికముగానగు.
ఉదా :
1) పొడిచినదాదిగా = పొడిచినది + ఆదిగా – ఇకార సంధి
2) ఆకలెత్తగ = ఆకలి + ఎత్తగ – ఇకారసంధి
3) అదేమి = అది + ఏమి – ఇకార సంధి
4) ఇదేమి = ఇది + ఏమి – ఇకార సంధి
ఆ) కింది వాటికి విగ్రహవాక్యాలు రాసి, సమాసాలను గుర్తించండి.
సమాస పదాలు | విగ్రహవాక్యం | సమాసం పేరు |
1) అమాంద్యం | మాంద్యము కానిది | నఞ్ తత్పురుష సమాసం |
2) సచ్ఛీలురు | మంచి శీలము కలవారు | బహుబ్లి హి సమాసం |
3) చిటికెల పందిళ్ళు | చిటికెలతో పందిళ్ళు | తృతీయా తత్పురుష సమాసం |
4) భారత క్ష్మాతలం | భారతము అనే భూభాగం | సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం |
5) హృదయకళిక | హృదయము అనే కళిక | రూపక సమాసం |
ఛందస్సు
I. తేటగీతి
1) నాలుగు పాదాలుంటాయి.
2) ప్రతి పాదానికి ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలూ, రెండు సూర్యగణాలూ వరసగా ఉంటాయి.
3) నాలుగో గణం మొదటి అక్షరం యతిస్థానం. ప్రాసయతి చెల్లుతుంది.
4) ప్రాస నియమము లేదు.
1.
అభ్యాసం :
అలాగే మీరు ఈ పద్యానికి సంబంధించిన మిగతా పాదాలకు గణవిభజన చేయండి.
గణవిభజన (2వ పద్యం, 2వ పాదం)
1) ఈ పాదంలో 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చాయి. ఇది తేటగీతి పద్యపాదం, యతి నాల్గవ గణం మొదటి అక్షరం.
గణ విభజన (2వ పద్యం, 3వ పాదం)
1) ఈ పాదంలో 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలున్నాయి. కావున తేటగీతి. యతి 4వ గణం మొదటి అక్షరం.
గణ విభజన (2వ పద్యం, 4వ పాదం)
1) ఈ పాదంలో 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలున్నాయి. కావున తేటగీతి. యతి 4వ గణం మొదటి అక్షరం.
9th Class Telugu 9th Lesson భూమి పుత్రుడు కవి పరిచయం
శ్రీ దువ్వూరి రామిరెడ్డిగారు 09.11.1895న నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఈయన 19వ ఏట సాహిత్యరంగంలో ప్రవేశించి నలజారమ్మ, వనకుమారి, కృషీవలుడు, జలదాంగన, యువకస్వప్నము, కడపటి వీడ్కోలు, పానశాల-కావ్యాలను, నక్షత్రశాల-నైవేద్యము, భగ్నహృదయము, పరిశిష్టము, ప్రథమకవిత్వము అనే ఖండకావ్యాలను రచించారు. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, ఫ్రెంచి, లాటిన్, జర్మన్, బెంగాలీ, పర్షియన్, ఉర్దూ, దువ్వూరి తమిళభాషలలో పండితులు. ఈయన 11.09. 1947 నాడు కన్నుమూశారు. వీరికి ‘కవికోకిల’ రామిరెడ్డి అను బిరుదు కలదు.
దువ్వూరివారి రచనాశైలి సరళసుందరంగా వుంటుంది. పాతకొత్తల, ప్రాక్పశ్చిమాల కలయికతో అందాన్ని సంతరించుకున్నది. విశ్వశాంతి, దేశభక్తి, మానవతావాదం, అభ్యుదయం ఈయన రచనలలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ మనకు మేలుకొలుపు పాడుతూ ఉంటాయి.
పద్యాలు – ప్రతిపదార్థాలు-భావాలు
1వ పద్యం : కంఠస్థ పద్యం
*చం! మనుజసమాజనిర్మితి సమంబుగ నీకొక ముఖ్యమైన వృ
త్తి నియత, మట్టి ధార్మికవిధిం జిరకాలము గౌరవంబుతో
మనిచిరి నీ పితామహుల మాంద్యసుశీలురు సర్వవృత్తిపా
వన కృషి జీవనైక పరిపాలన లోకహితార్థకాంక్షులై.
ప్రతిపదార్థం :
మనుజసమాజనిర్మితి సమంబుగన్;
మనుజ = మానవుల యొక్క
సమాజ = సమాజాన్ని (సంఘాన్ని)
నిర్మితి = నిర్మాణంలో
సమంబుగన్ = సమత్వము కలిగేలా
నీకున్ = నీకు
ఒక = ఒక
ముఖ్య మైన = ప్రధానమైన
వృత్తి = వృత్తి
నియతము = నిర్ణయింపబడింది (నియమించబడింది.)
అట్టి = అటువంటి
ధార్మిక విధిన్ = ధర్మబద్ధమైన పనిని
చిరకాలము = చాలాకాలము
అమాంద్య సుశీలురు; అమాంద్య = సోమరితనంలేని
సుశీలురు = గొప్ప శీలవంతులు అయిన
నీ పితామహులు = నీ తండ్రి తాతలు
సర్వవృత్తి ……. లోకహితార్థకాంక్షులై;
సర్వవృత్తి = అన్ని వృత్తులలో
పావన = పవిత్రమైన
కృషి = వ్యవసాయాన్నే
జీవన + ఏక = ముఖ్య జీవనంగా
పరిపాలన = చక్కగా కాపాడుతూ
లోకహిత + అర్థ, కాంక్షులు + ఐ = ప్రపంచానికి మేలు చేయాలనే కోరిక కలవారై
గౌరవంబుతోన్ = గౌరవంగా
మనిచిరి నిర్మితి = రక్షించారు; పోషించారు.
భావం :
మానవ సమాజ నిర్మాణంలో భాగంగా, నీకొక ముఖ్యమైన వృత్తిని అప్పగించడం జరిగింది. అది వ్యవసాయ వృత్తి. ఇది వృత్తులలోకెల్లా పవిత్రమైనది. ప్రపంచానికి మేలు చేకూర్చాలనే కోరికతో, నీ పూర్వికులు ధర్మబుద్ధితో చాలాకాలంగా గౌరవంతో, వ్యవసాయ వృత్తిని నిర్వహిస్తూ వస్తున్నారు.
2వ పద్యం :
తే॥ శ్రమలు లేకయె ఫలములు దుముకబోవు
పిండికొలదియె రొట్టె; యోపిన విధాన
కష్టపడుము కృషీవలా, కలుగు సుఖము
ఉత్తయాసలకన్న మే లుద్యమంబు
ప్రతిపదార్థం :
కృషీవలా – ఓ కర్షకుడా!
శ్రమలు లేకయె = శ్రమపడకుండా
ఫలములు = ఫలితాలు
దుముకబోవు = ఉట్టిపడవు (తమంతట తాముగా రావు)
పిండికొలది + ఎ = పిండిమేరకే
రొట్టె = రొట్టె తయారవుతుంది
ఓపిన విధాన = శక్తికి తగ్గట్టుగా (శక్తివంచన లేకుండా)
కష్టపడుము = కష్టపడు
సుఖము, కలుగున్ = నీకు సుఖం కలుగుతుంది
ఉత్త + ఆసలకన్నన్ = కేవలమూ ఆశలతో జీవించడం కన్నా
ఉద్యమంబు = ప్రయత్నం చేయడం
మేలు = మంచిది
భావం :
కృషీవలా! శ్రమ చేయకుండా, ఫలితాలు రావు. పిండి కొద్దీ రొట్టె కదా! శక్తివంచన లేకుండా కష్టపడు. నీకు సుఖం కలుగుతుంది. కేవలం ఉత్త ఆశలతో జీవించడం కన్నా, ప్రయత్నం చేయడం మంచిది.
3వ పద్యం
తే॥ వేలనూతుల కుగాలు నిలుపువారు,
బోడితలకు మోకాళ్ళకు ముడులువెట్టు
వారు, చిటికెల పందిళ్ళు పన్నువారు
నిన్నుఁ బోలరు, తమ్ముడా, యెన్నడైన
ప్రతిపదార్థం :
నేల నూతులకున్ = బావులకు (లోతుగా ఉండే దిగుడు బావులకు)
ఉగ్గాలు = చేదలు (చిన్న చెంబులు)
నిలుపువారు = ఏర్పాటు చేసేవారు
బోడితలకున్ = వెండ్రుకలు లేని తలకూ
మోకాళ్ళకున్ = మోకాళ్ళకూ
ముడులువెట్టువారు = ముళ్ళు వేసేవారు
చిటికెల పందిళ్ళు పన్నువారు = మాటలతో మభ్య పెట్టేవారు (ఇంత చేస్తాము, అంత చేస్తాము అని అతిడంబములు పలికి నమ్మించేవారు.)
తమ్ముడా = సోదరా !
ఎన్నడైనన్ = ఎప్పుడూ కూడా
పోలరు (నీకు) = సాటిరారు
భావం :
తమ్ముడా ! లోకంలో కొందరు చిత్రంగా ఉంటారు. వీరిలో కొంతమంది చిన్నతాడు కట్టిన చెంబుతో నేలనూతిలోని నీళ్ళుతోడుతారు. మరికొందరు గుండుకూ మోకాలికీ ముడి పెడతారు. ఇంకొందరు చిటికెలతో పందిళ్ళు వేస్తారు. చేతలతో సమాజసేవ చేస్తున్న నీకు, వారు ఎప్పుడూ సాటిరారు. (పైన చెప్పిన వారంతా కేవలం మాటల చమత్కారంతో, అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తారు.)
4వ పద్యం :
తే|| సైరికా, నీవు భారతజ్మా తలాత్మ
గౌరవ పవిత్రమూర్తివి! శూరమణివి!
ధారుణీపతి పాలనదండ మెపుడు
నీహలంబు కన్నను బ్రార్థనీయమగునె?
ప్రతిపదార్థం :
సైరికా = సేద్యకాడా! (ఓ రైతా!)
భారత క్ష్మాతల = భారతదేశం యొక్క (భారత భూమండలం యొక్క)
ఆత్మగౌరవ = ఆత్మగౌరవాన్ని ప్రకటించే
పవిత్రమూర్తివి = పవిత్ర రూపుడవు
శూరమణివి = శూరులలో శ్రేష్ఠుడివి
ధారుణీపతి = భూమిని పాలించే రాజు యొక్క
పాలన దండము = పాలించే ధర్మదండము
ఎపుడున్ = ఎప్పుడునూ
నీ హలంబుకన్నను = నీ నాగలికంటె
ప్రార్థనీయము + అగునె = కోరదగినది అవుతుందా? (కాదు) (రాజు చేతిలోని ధర్మదండం కన్నా, నీ చేతి నాగలి గొప్పది అని భావము)
భావం :
హాలికుడా ! నీవు భారతదేశ ఆత్మగౌరవాన్ని తెలిపే పవిత్ర స్వరూపానివి. శూరులలో శ్రేష్ఠుడివి. రాజు చేతిలోని ధర్మదండం కన్నా, నీ చేతిలోని నాగలి గొప్పది. (రాజదండంలో దండించే గుణం ఉంది. నీ నాగలిలో పండించే గుణం ఉంది.)
5వ పద్యం :
తే॥ దైనికావశ్యకమ్ముల దాటిపోవ
వెగుర టెక్కలురాని నీ యిచ్ఛలెపుడు;
పైరుపచ్చలె యవధిగా (బ్రాకుచుండు
నీ విచారము, సహయు, నిపుణతయును
ప్రతిపదార్థం :
ఎగురన్ = ఎగరడానికి
ఱెక్కలురాని = రెక్కలు లేని
నీ + ఇచ్చలు = నీ కోరికలు
ఎపుడు = ఎప్పుడూ
దైనిక + ఆవశ్యకములన్ = రోజురోజూ అవసరములయిన నిత్యావసర వస్తువులను
దాటిపోవవు = అతిక్రమింపవు
నీ విచారమున్ = నీ ఆలోచనయూ
ఊహయున్ = ఊహయూ
నిపుణతయును = నేర్పునూ
పైరుపచ్చలు + ఎ – పైరుపంటలే (పైరు పంటల్ని బాగా పెంచడం మీదే)
అవధిగాన్ = హద్దుగా
ప్రాకుచుండున్ = అల్లుకుంటాయి
భావం :
నీవు నిత్యావసరాలు గడచిపోతే చాలని చూస్తావు తప్ప, నీకు అంతకు మించిన కోరికలు లేవు. నీ ఊహలనూ, ఆలోచనలనూ, నైపుణ్యాలనూ అన్నింటినీ, పైరు పంటలను పండించడానికే వినియోగిస్తావు. (నీకు రోజు ఎలాగో గడచిపోతే చాలు. అది ఇది కావాలనీ, ఏదో సంపాదించేద్దామనీ నీవు కోరవు. నీ తెలివితేటలు అన్నింటినీ పైరుపంటలను బాగా పెంచడం మీద పెడతావు.)
6వ పద్యం :
తే॥ ప్రొద్దువొడిచిన దాదిగా ప్రొద్దుగ్రుంకు
వజకు కష్టింతువేగాని యిరుగుపొరుగు
వారి సంపదకై యీసు గూరబోవ
వెంత నిర్మలమోయి, నీ హృదయకళిక!
ప్రతిపదార్థం :
ప్రొద్దు + పొడిచినది = సూర్యుడు ఉదయించినది
ఆదిగా = మొదలుగా (తెల్లవారినప్పటి నుండి)
ప్రొద్దు + క్రుంకు వఱకు = సూర్యుడు అస్తమించే వజకూ
కష్టింతువే + కాని = కష్టపడతావే కానీ
ఇరుగుపొరుగు వారి = ప్రక్కన, దగ్గరగానూ ఉన్న వారి
సంపదకై = ఐశ్వర్యానికై
ఈసు + కూరబోవవు = అసూయ పొందవు
నీ హృదయ కళిక = నీ హృదయము అనే మొగ్గ
ఎంత నిర్మలము + ఓయి = ఎంత పవిత్రమైనదో కదా!
భావం :
తెల్లవారినప్పటి నుండి సాయంత్రం అయ్యే వఱకూ కష్టపడతావు. అంతేకాని ఇరుగు పొరుగు వారి సంపదలను గూర్చి అసూయపడవు. నీ మనస్సు ఎంతో స్వచ్ఛమైనది.
7వ పద్యం :
తే॥ ఉండి తిన్నను లేక పస్తున్న గాని
యాసచేయవు పరుల కష్టార్జితంబు!
నాకలెత్తగ నీ పంచ కరుగు నతిథి
తినక, త్రావకపోయిన దినములేదు
ప్రతిపదార్థం :
ఉండి = నీకు తినడానికి తిండి ఉండి
తిన్నను = నీవు తినినా
లేక = నీకు తినడానికి లేక
పస్తున్నగాని (పస్తు + ఉన్న + కాని) = ఉపవాసము ఉన్నా కాని
పరుల = ఇతరుల
కష్టార్జితంబున్ (కష్ట + ఆర్జితంబు) = కష్టించి సంపాదించిన దానిని
ఆసచేయవు = ఆశించవు
ఆకలి + ఎత్తగన్ = ఆకలివేయగా
నీ పంచకున్ = నీ ఇంటి దగ్గరకు
అరుగు = వెళ్ళే (వెళ్ళిన)
అతిథి = అతిథి (అతిథి, అభ్యాగతి మొదలయిన వారు)
తినక = కడుపు నిండా తినకుండా
త్రావక = కావలసిన మంచినీరు, మజ్జిగ మొదలయినవి త్రాగి దాహం తీర్చుకోకుండా
పోయిన = వెళ్ళిపోయిన
దినము లేదు = రోజు లేదు
భావం :
నీవు తిన్నా, తినకపోయినా ఇతరులు సంపాదించుకున్న సంపదలకు ఎప్పుడూ ఆశపడవు. ఆకలితో నీ ఇంటికి వచ్చిన అతిథి కడుపు నిండా తిని, తృప్తిగా తాగి వెడతాడు. (అంటే రైతు అతిథి అభ్యాగతులకు తిండి పెట్టి వారి దాహం తీరుస్తాడని భావం)
8వ పద్యం :
తే॥ కృషి సకల పరిశ్రమలకు కీలుచీల ;
సత్పరిశ్రమ వాణిజ్య సాధనంబు,
అఖిల వాణిజ్యములు సిరికాటపట్లు
సిరియె గోపలబ్దికి జీవగఱ్ఱ
ప్రతిపదార్ధం :
కృషి = వ్యవసాయమే
సకల పరిశ్రమలకున్ = అన్ని పరిశ్రమలకూ
కీలుచీల = ముఖ్యమైన సీల (మూలము)
సత్పరిశ్రమ = మంచి పరిశ్రమయే
వాణిజ్య సాధనంబు = వ్యాపారానికి సాధనము
అఖిల వాణిజ్యములు= అన్ని వ్యాపారాలూ
సిరికి = సంపదకు
ఆటపట్లు = వాసస్థానము (నివసించే చోటు)
సిరియె = సంపదయే
భోగోపలబ్ధికిన్ (భోగ + ఉపలబ్ధికి) = సుఖాలను పొందడానికి
జీవగఱ్ఱ (జీవ + కఱ్ఱ) = బ్రతికించు మందు
భావం :
వ్యవసాయమే పరిశ్రమలన్నింటికీ మూలం. పరిశ్రమలు వ్యాపారానికి సహాయపడతాయి. వ్యాపారం వల్ల సంపద కలుగుతుంది. సంపద వల్ల సుఖం లభిస్తుంది.
9వ పద్యం :
తే|| కావున కృషీవలా, నీవె కారణమవు
సాంఘికోత్కృష్ట సౌభాగ్య సౌఖ్యములకు;
ఫల మనుభవించువారలు పరులు; నీకుఁ
గట్టఁ గుడువను కజవె యెక్కాలమందు !
ప్రతిపదార్థం :
కృషీవలా – ఓ హాలికా!
నుతులన్ = పొగడ్తలతో
సాంఘికోత్కృష్ట సౌభాగ్య సౌఖ్యములకు; సాంఘిక = సంఘమునకు సంబంధించిన (సమాజానికి చెందిన)
ఉత్కృష్ట = ఉప్పొంగిన
సౌభాగ్య = వైభవానికి
సౌఖ్యములకు = సుఖాలకు
నీవె (నీవు + ఎ) = నీవె
కారణమవు = కారకుడవు
తలపరు = జ్ఞప్తికి తెచ్చుకోరు
ఫలము + అనుభవించు వారలు = ఫలాన్ని అనుభవించేవారు
పరులు = ఇతరులు
నీకు = నీకు మాత్రం
కట్టన్ = కట్టుకొనే బట్టకూ
భుజించుచున్ = అనుభవిస్తూ
కుడువను = తినడానికీ (తిండికీ)
నినున్ = నిన్ను ఎక్కాలమందు
(ఏ + కాలమందు) = ఎప్పుడునూ
కఱవె (కఱవు + ఎ) = లోటే
భావం:
ఓ హాలికుడా ! సమాజం సుఖసంతోషాలతో ఉండడానికి నీవే కారణం. నీ కష్టఫలితాన్ని ఇతరులు అనుభవించి సుఖపడుతున్నారు. నీకు మాత్రం తిండికీ, బట్టకూ ఎప్పుడూ కొరతే (లోటే).
10వ పద్యం : కంఠస్థ పద్యం
*మ|| ఫలము ల్మెక్కెడివారు తత్ఫల రసాస్వాద క్రియాలోలురై
పలుమాజమ్మధురత్వమున్నుతుల సంభావింతురేగాని, త
త్ఫల హేతుక్రమవృక్షముం దలపరెవ్వారైన, వట్లే రమా
కలితు ల్బోగములన్ భుజించుచు విమం గన్నెత్తియుం జూతురే?
ప్రతిపదార్థం :
ఫలముల్ = పండ్లను
మెక్కెడి వారు = తినేవారు
తత్ఫల రసాస్వాదక్రియాలోలురై ; తత్ + ఫల = ఆ పండ్ల యొక్క
రస = రసాన్ని
ఆస్వాదక్రియా = అనుభవించే పనిలో
లోలురు + ఐ = అత్యాసక్తి కలవారై
పలుమాఱు = చాలాసార్లు
అమ్మధురత్వమున్ (ఆ + మధురత్వమున్) = ఆ తీపిదనాన్ని
సంభావింతురేకాని = గౌరవిస్తారే కాని
తత్ఫలహేతుక్రమవృక్షముం; తత్ + ఫల = ఆ పండు రావడానికి
హేతుక్రమ = కారణభూతమైన
వృక్షముం = చెట్టును గూర్చి
ఎవ్వా రైన = ఎవ్వరునూ
అట్లే = ఆ విధముగానే
రమా కలితుల్ = లక్ష్మీ సంపన్నులు (ధనంతో కూడినవారు)
భోగములన్ = సుఖాలను
కన్నెత్తియున్ + చూతురే = కన్ను పైకెత్తి చూడరు. (పట్టించుకోరు)
భావం :
పండ్లను తినేవారు వాటి తియ్యదనాన్ని పొగడుతూ తింటారే కాని, ఆ పండ్లను ఇచ్చిన చెట్టును గూర్చి ఎప్పుడైనా ఆలోచిస్తారా ? అలాగే నీ కష్టంతో భోగభాగ్యాలను అనుభవించే లక్ష్మీ సంపన్నులు నిన్ను కన్నెత్తి కూడా చూడరు కదా !
11వ పద్యం :
ఉ॥ అట్టి కృతఘ్నులన్ మనమునందుఁ దలంపక సేద్యనాద్యఫున్
ఘట్టన వస్థిపంజరముగా తమవెండినగాని, వరముల్
నీవు పట్టినగాని, క్షామములు వచ్చినగాని శరీరసత్వమే
పట్టుగ స్వశ్రమార్జితము పట్టెడు నన్నము దిందు ఎప్పుడున్!
ప్రతిపదార్థం :
అట్టి = అటువంటి
కృతఘ్నులన్ = చేసిన మేలు మరచిపోయిన వారిని
మనమునందున్ = (నీ) మనస్సు నందు
తలంపక = పట్టించుకోక (భావింపక)
సేద్యనాద్యపుం ఘట్టనన్ ; సేద్యనాద్యము = వ్యవసాయ సంబంధమైన
ఘట్టనన్ = రాపిడితో (సేద్యంలో పడే కష్టంతో)
అస్థిపంజరముగా = ఎముకల గూడుగా
తనువు = (నీ) శరీరము
ఎండినగాని = ఎండిపోయినా
వర్షముల్ = వర్షాలు (అతివృష్టి
పట్టిన + కాని = వచ్చినా
క్షామములు = కఱవులు (అనావృష్టి వల్ల)
వచ్చిన + కాని = వచ్చినా
శరీరసత్త్వము + ఏ = (నీ) శరీరంలోని శక్తియే
పట్టుగ = ఊతగా (అవలంబముగా) స్వశ్రమ + ఆర్జితము = (నీ) శరీర శ్రమతో లభించిన
పట్టెడు + అన్నమున్ (పట్టు + ఎడు) = గుప్పెడు అన్నాన్ని
ఎప్పుడున్ = ఎప్పుడునూ
తిందువు = తింటావు
భావం :
చేసిన మేలును మరచిపోయేవారిని నీవు అసలు పట్టించుకోవు. వ్యవసాయాన్ని చేయడంలో నీ శరీరం ఎముకల గూడుగా మారినా, వానలు ముంచెత్తినా, కరవు పీడించినా వాటిని లెక్క చేయవు. నీ శరీర కష్టాన్నే నమ్ముకొని, నీ శరీర శ్రమతో లభించిన పట్టెడన్నమైనా సరే దాన్నే తింటావు.
12వ పద్యం :
తే॥ ఓ కృషీవల ! నీవు కష్టోత్కటంపు
దుర్భరావస్థ యందె తోదోపువడగ
నెవరు శాసించువారు, నీకేమి కొదవ ?
ఆత్మవిజ్ఞానమయముగా నలవరింపు
ప్రతిపదార్థం :
ఓ కృషీవల = ఓ కర్షకుడా !
నీవు = నీవు
కష్టోత్కటంపు దుర్భరావస్థ + అందె; కష్ట + ఉత్కటము = పెద్ద కష్టంతో కూడిన
దుర్భర + అవస్థయందె = భరింపరాని స్థితియందే
తోదోపు + పడగన్ (తోపు + తోపు) = ఎక్కువగా రాపిడి పొందాలని
ఎవరు = ఎవరు
శాసించువారు = (నిన్ను) ఆజ్ఞాపిస్తారు
నీకున్ = నీకు
కొదవ = లోటు
ఏమి = ఏముంది?
ఆత్మ విజ్ఞానమయముగా = నిన్ను నీవు తెలిసికొనడం
అలవరింపు = నేర్చుకో
భావం :
ఓ కృషీవలా! నీవు పెద్ద కష్టాలలో కూరుకుపోవాలని నిన్ను శాసించేవారు ఎవరు ? నీకేమి తక్కువ ? నీ గొప్పతనాన్ని నీవు తెలుసుకో.
13వ పద్యం :
జీవనస్పర్థ సామాన్య చేష్టమైన
కాలమున వ్యక్తివాద మగ్రత వహించు
సత్యవిరహితు డన్యభోజ్యత నశించు
నరజీవియె యంతరాయముల దాటు
ప్రతిపదార్థం :
జీవన స్పర్ధ = బ్రతకడం విషయంలో పోటీ
సామాన్యచేష్ట = సహజమైన కార్యము
ఐన కాలమున = అయిన నేటి రోజుల్లో
వ్యక్తివాదము = ఆయా వ్యక్తుల తత్త్వము (వ్యక్తి యొక్క కృషి)
అగ్రత వహించు = ప్రాధాన్యాన్ని పొందుతుంది
సత్త్వ విరహితుడు = సత్తువ లేనివాడు
అన్యభోజ్యతన్ = ఇతరులు పెట్టే తిండిపై ఆధారపడడంతో
నశించు = నాశనం అవుతాడు
అర్హజీవి + ఎ = అర్హత గలవాడే
అంతరాయములన్ = విఘ్నములను
దాటున్ = దాటుతాడు
భావం :
బ్రతకడం కోసం పోటీతత్వం సహజమైన కాలం ఇది. ఈ పరిస్థితులలో వ్యక్తివాదం ప్రాధాన్యం వహిస్తుంది. ఏ ప్రయత్నమూ, ఏ పనీ చేయనివాడు ఇతరులపై ఆధారపడి జీవిస్తూ నాశనం అవుతాడు. కానీ శ్రమను నమ్ముకున్నవాడు, ఎలాంటి అడ్డంకులనయినా దాటగలడు.
14వ పద్యం :
తే॥ కావ జీవనసంగ్రామ కార్యమందు
విజయి వగుటకు శౌర్యంబు, విద్య, బుద్ధి,
సత్యసంధత, యాత్మవిశ్వాస మనెడు
నాయుధంబుల విడవకు హలికవర్య
ప్రతిపదార్థం :
హలికవర్య = శ్రేష్ఠుఁడవైన ఓ రైతూ !
కానన్ = కాబట్టి
జీవన సంగ్రామ కార్యమందు జీవన = జీవితము అనే
సంగ్రామ కార్యమందు = యుద్ధంలో
విజయివి + అగుటకు = విజయం పొందడానికి
శౌర్యంబు = శక్తి
విద్య = చదువు
బుద్ధి = తెలివి
సత్యసంధత = సత్యవాక్కు
ఆత్మవిశ్వాసము = నీపై నీకు నమ్మకము
అనెడు = అనే
ఆయుధంబులన్ = ఆయుధాలను
విడవకు = విడిచిపెట్టవద్దు
భావం :
కాబట్టి – ఓ రైతు శ్రేష్ఠుడా! జీవితము అనే యుద్ధంలో విజయం పొందడానికి ‘శక్తి, చదువు, తెలివి, సత్యము, నీపై నీకు నమ్మకము’ అనే ఆయుధాలను విడువక ముందుకు నడువు
AP Board Textbook Solutions PDF for Class 9th Telugu
- AP Board Class 9 Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 1 శాంతికాంక్ష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 2 స్వభాష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 3 శివతాండవం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 4 ప్రేరణ Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 5 పద్యరత్నాలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 6 ప్రబోధం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 7 ఆడినమాట Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 8 చూడడమనే కళ Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 9 భూమి పుత్రుడు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 10 బతుకు పుస్తకం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 11 ధర్మదీక్ష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu లేఖలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu వ్యాసాలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Grammar Chandassu ఛందస్సు Textbook Solutions PDF
0 Comments:
Post a Comment