![]() |
AP Board Class 8 Telugu Chapter 4 అజంతా చిత్రాలు Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 8th Telugu Chapter 4 అజంతా చిత్రాలు Book Answers |
Andhra Pradesh Board Class 8th Telugu Chapter 4 అజంతా చిత్రాలు Textbooks Solutions PDF
Andhra Pradesh State Board STD 8th Telugu Chapter 4 అజంతా చిత్రాలు Books Solutions with Answers are prepared and published by the Andhra Pradesh Board Publishers. It is an autonomous organization to advise and assist qualitative improvements in school education. If you are in search of AP Board Class 8th Telugu Chapter 4 అజంతా చిత్రాలు Books Answers Solutions, then you are in the right place. Here is a complete hub of Andhra Pradesh State Board Class 8th Telugu Chapter 4 అజంతా చిత్రాలు solutions that are available here for free PDF downloads to help students for their adequate preparation. You can find all the subjects of Andhra Pradesh Board STD 8th Telugu Chapter 4 అజంతా చిత్రాలు Textbooks. These Andhra Pradesh State Board Class 8th Telugu Chapter 4 అజంతా చిత్రాలు Textbooks Solutions English PDF will be helpful for effective education, and a maximum number of questions in exams are chosen from Andhra Pradesh Board.Andhra Pradesh State Board Class 8th Telugu Chapter 4 అజంతా చిత్రాలు Books Solutions
Board | AP Board |
Materials | Textbook Solutions/Guide |
Format | DOC/PDF |
Class | 8th |
Subject | Telugu |
Chapters | Telugu Chapter 4 అజంతా చిత్రాలు |
Provider | Hsslive |
How to download Andhra Pradesh Board Class 8th Telugu Chapter 4 అజంతా చిత్రాలు Textbook Solutions Answers PDF Online?
- Visit our website - Hsslive
- Click on the Andhra Pradesh Board Class 8th Telugu Chapter 4 అజంతా చిత్రాలు Answers.
- Look for your Andhra Pradesh Board STD 8th Telugu Chapter 4 అజంతా చిత్రాలు Textbooks PDF.
- Now download or read the Andhra Pradesh Board Class 8th Telugu Chapter 4 అజంతా చిత్రాలు Textbook Solutions for PDF Free.
AP Board Class 8th Telugu Chapter 4 అజంతా చిత్రాలు Textbooks Solutions with Answer PDF Download
Find below the list of all AP Board Class 8th Telugu Chapter 4 అజంతా చిత్రాలు Textbook Solutions for PDF’s for you to download and prepare for the upcoming exams:8th Class Telugu 4th Lesson అజంతా చిత్రాలు Textbook Questions and Answers
చదవండి – ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
పై చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
పై చిత్రంలో అంబర్ పేట ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు బస్సులో విహారయాత్రకు వెళ్ళడానికి బస్సు ఎక్కుతున్నారు. కొందరు పిల్లలు బస్సు ఎక్కారు. మరి కొందరు ఎక్కుతున్నారు. వారి ఉపాధ్యాయులూ, ఉపాధ్యాయినులూ దగ్గరుండి, పిల్లలను బస్సు ఎక్కిస్తున్నారు.
ప్రశ్న 2.
విహారయాత్ర అంటే ఏమిటి? ఎందుకు వెళతారు?
(లేదా)
యాత్రల వల్ల దేశాన్ని చూడవచ్చు, విజ్ఞానాన్ని సంపాదించవచ్చు – అని రచయిత అన్నారు కదా ! యాత్రల వల్ల ఇంకా ఇతర ప్రయోజనాలేమిటి ?
జవాబు:
వినోదం ప్రధానంగా చేసుకొని, చేసే యాత్రను విహారయాత్ర అంటారు. పుస్తక పఠనం వల్ల పుస్తక జ్ఞానం మాత్రమే లభిస్తుంది. లోకానుభవం, ప్రజల ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలంటే యాత్రలు చేయవలసి ఉంది. విజ్ఞానయాత్రల వలన మానసికోల్లాసంతోపాటు, విజ్ఞానం పెరుగుతుంది. ప్రసిద్ధమైన పరిశ్రమలు, ప్రాజెక్టులు, తీర్థయాత్ర స్థలములు, అందమైన దృశ్యాలు, చారిత్రక ప్రదేశాలు, బౌద్ధ విహారాలు, శిల్పకళా క్షేత్రములు మొదలయిన వాటిని ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటారు.
ప్రశ్న 3.
ఒక అందమైన ప్రదేశాన్నో, దృశ్యాన్నో చూసినప్పుడు మనకు ఏమనిపిస్తుంది?
జవాబు:
ఒక అందమైన ప్రదేశాన్నో, దృశ్యాన్ని చూసినపుడు మనసుకు ఆనందం కలుగుతుంది. ఆ దృశ్యము ఎప్పటికీ మరవకూడదని మన వెంట తెచ్చుకున్న కెమేరాలలో బంధిస్తాము. తరువాత అప్పుడప్పుడు వాటిని చూస్తూ ఉంటే మన , తిరిగిన ఆ ప్రదేశాలు అన్నీ గుర్తుకు వచ్చి, మనసుకు మధురానుభూతి కలుగుతుంది.
ఇవి చేయండి
I. వినడం – మాట్లాడడం
ప్రశ్న 1.
మీరు ఏదైనా ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళారా? ఆ ప్రదేశాన్ని గురించి చెప్పండి.
జవాబు:
మేము సంక్రాంతి సెలవులలో మా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో మా తరగతిలోని విద్యార్థులమంతా కలసి ‘నాగార్జున సాగర్’ విహారయాత్రకు వెళ్ళాం. నాగార్జున సాగర్ చేరాక స్టీమర్ ద్వారా నాగార్జున కొండకు బయలుదేరాము. స్టీమర్ లో ప్రయాణిస్తున్నంత సేపు చల్లని గాలి, కనుచూపు మేర కృష్ణా నది, దూరంగా కొండలు మాలో సంతోషాన్ని నింపాయి. ఆ నాగార్జున కొండలో పూర్వం ఒక గొప్ప విశ్వవిద్యాలయం ఉన్నట్లుగా ఇప్పటికీ ఆధారాలు కన్పిస్తున్నాయి. అక్కడ ఆచార్య నాగార్జునుడనే ఒక గొప్ప తత్త్వవేత్త, ఆయుర్వేద పండితుడు ఉండేవాడని మా ఉపాధ్యాయులు చెప్పారు. అంతేగాక అక్కడి మ్యూజియంలో ఉన్న బుద్ధుని పాలరాతి శిల్పాలను చూశాం. బౌద్ధమత విశిష్టతను గురించి తెలుసుకున్నాం. తర్వాత మేము నాగార్జున సాగర్ ఆనకట్ట వద్దకు చేరాం. జల విద్యుత్ తయారయ్యే విధానాన్ని స్వయంగా చూసి తెలుసుకున్నాం. తిరుగు ప్రయాణంలో ఎత్తిపోతల జలపాతాన్ని, మాచర్ల చెన్నకేశవాలయాన్ని, వీరభద్రాలయాన్ని చూశాం.
ఈ విహారయాత్ర మాలో ఆనందంతో పాటు విజ్ఞానాన్ని కూడా నింపింది.
ప్రశ్న 2.
పాఠంలోని ఒక అంశాన్ని గ్రహించి అది మీకు ఎందుకు నచ్చిందో చెప్పండి.
జవాబు:
ఈ పాఠంలో ఏడవ పేరా నాకు నచ్చింది. ఆ పేరాలో అజంతా గుహలలోకి ప్రవేశించే దారిని నార్లవారు వర్ణించారు. అక్కడ ప్రకృతి వర్ణన నాకు నచ్చింది. అక్కడ నాలుగువైపులా కొండలే ఉన్నాయట. ఇక కొండ పక్కన నది. ఆ నదిలో నీళ్ళు నీలంగా ఉన్నాయి. పైన ఆకాశము నీలమే. ఆ పక్కనే పచ్చని చెట్లు ఉన్నాయట. ఆ చెట్ల పూలు కమ్మని వాసనలను ఇస్తున్నాయి. నిజంగానే అక్కడికి వెళ్ళి చూస్తున్నట్లు నార్లవారు వర్ణించారు. వారు చెప్పినట్లు అది ఒక కలల లోకం. అది నిజంగానే భూలోకంలోని స్వర్గం. వారు చెప్పినట్లు అది నిజంగా మరో ప్రపంచం – అందుకే నాకు ఆ అంశం నచ్చింది.
ప్రశ్న 3.
పాఠం చదువుతుంటే మీకు వచ్చిన ఆలోచనలను, అనుభూతిని వివరించండి.
జవాబు:
అజంతా గుహలు పాఠం చదువుతూ ఉంటే, పెద్ద అయ్యాక తప్పకుండా వెళ్ళి ఒకసారి ఆ గుహల అందాన్ని చూసి రావాలనిపించింది. అక్కడ బుద్ధుని చిత్రాలను, నెహ్రూగారిని సైతం ఆకర్షించిన అక్కడి అందమైన స్త్రీల చిత్రాలనూ చూడాలని అనిపించింది. ఆ కొండల వరుస గూర్చి చదువుతూ ఉంటే, నిజంగానే ఏదో కలలో కొండలమీద నేను తిరుగుతున్నట్టు అనిపించింది. అజంతా గుహల సౌందర్యాన్నీ, అక్కడి చిత్రాలనూ, తప్పక వీలయినంత త్వరలో మా కుటుంబ సభ్యులతో కలిసి చూద్దామని ఉంది.
II. చదవడం, అవగాహన చేసుకోవడం
ప్రశ్న 1.
పాఠం చదవండి. వర్ణనతో కూడి ఉన్న ఐదు వాక్యాలను గుర్తించండి. వాటి కింద గీత గీయండి. చదివి వినిపించండి.
జవాబు:
1. మీ పైన నీలాకాశం, మిమ్ము అలరిస్తూ అడవి పువ్వులు, మిమ్ము ఆవరిస్తూ ఆ పువ్వుల కమ్మని నెత్తావులు. గుహలను చేరే వరకు రెండు, మూడు మెలికలను కాబోలు మీరు తిరుగుతారు. ఏ మెలికలో అడుగుపెడితే, దానికి అదే ఒక ప్రపంచం.
2. ఇటు కొండ-అటు కొండ, ముందు కొండ వెనుక కొండ-పైన కొండ, పక్కనే నది – నీలాకాశం – నీలాల నీళ్ళు – పచ్చని చెట్లు – కమ్మని తావులు, అది వేరే ప్రపంచం – అదొక స్వాప్నిక జగత్తు. భూలోక స్వర్గము.
3. రాళ్ళ గుట్టల గుండా జలజల ప్రవహిస్తూ, నది పాడుకొనే పాటలను వింటూ, నది అంచు వెంట కాలినడకన, గుహలకు చేరాలి.
4. గుహలను సమీపిస్తూంటే ఇటు పచ్చని కొండ, అటు పచ్చని కొండ ఈ రెండు కొండల మధ్య వాఘోరా నది.
5. కొలను నుంచి కొలనుకు జాలువారుతూ, 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద ధారగా వాఘోరా నది కొండ దిగువకు దూకుతుంది.
ప్రశ్న 2.
కింద సూచించిన పదాలతో మొదలయ్యే పేరాలు చదివి, సరిపోయే శీర్షికలను సూచించండి.
పేరా | శీర్షిక |
ఇటీవలనే …….. | అవ్యక్తానుభూతి |
వాఘోరానది పుట్టి ………. | వ్యూపాయింట్ – మేజర్ గిల్ |
గుహల గోడలకు ………… | శిథిలావస్థలో అజంతా చిత్రాలు |
అజంతా గుహల నిర్మాణం ……….. | సర్వోత్తమ కృషి |
ఇక్కడ అందాలొలుకు ……….. | అందాలొలుకు అజంతా స్త్రీలు |
ప్రశ్న 3.
కింది పేరా చదివి పట్టికను పూరించండి.
అజంతా గుహలు మొత్తం 29. వాటిలో 5 బౌద్ధ చైత్యాలైతే మిగిలిన బౌద్ధ విహారాలు. మొత్తం 29లో మూడింటిని ప్రారంభించి పూర్తి చేయకుండానే ఆపివేశారు. ఇవి తప్ప మిగిలిన అన్నింటినీ చిత్రాలతో నింపివేశారు. కాని ఈనాడు పదమూడు గుహలలో మాత్రమే ఆ చిత్రాల శిథిలాలు కానవస్తున్నాయి. చెక్కు చెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలు మిగిలింది ఒకటవ, రెండవ, తొమ్మిదవ, పదవ, పదహారవ, పదిహేడవ గుహలలోనే. అజంతా గుహలలోని కొన్ని చిత్రాలకు నకళ్ళు వేయించి హైదరాబాదు పబ్లిక్ గార్డెన్స్ లోని అజంతా పెవిలియన్లో భద్రపరిచారు.
జవాబు:
4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అ) నార్ల వేంకటేశ్వరరావు గురించి రాయండి.
(లేదా)
అజంతా చిత్రాలు పాఠ్యభాగ రచయిత గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
నార్ల వేంకటేశ్వరరావు 1908 డిసెంబర్ 1వ తేదీన కృష్ణా జిల్లాలోని ‘కవుతరం’ అనే గ్రామంలో జన్మించారు. ఈయన రష్యన్ కథలు (అనువాద రచన), నరకంలో హరిశ్చంద్రుడు (నాటకం), నార్లవారి మాట (పద్య కావ్యం) మొదలైన గ్రంథాలను రచించారు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు. నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం కృషిచేసిన మేధావి. ఈయన రచన సరళంగా సొగసైన భావాలతో సుందర శైలిలో నడుస్తుంది.
ఆ) అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి ? వాటి విశిష్టతను తెలపండి.
జవాబు:
అజంతా గుహలు జల్గామ్ కు దక్షిణంగా 35 మైళ్ళ దూరంలో, ఔరంగాబాదు ఉత్తరంగా 55 మైళ్ళ దూరాన ఉన్నాయి. అజంతా గుహలలోని భారతీయ చిత్రకళ, అంతకు ముందుగాని, ఆ తర్వాత గాని అందుకోనంతటి మహోన్నత శిఖరాలను అందుకొంది. వాఘోరా నది పుట్టిన చోటుననే అజంతా గుహలున్నాయి. బౌద్ధభిక్షువులు అక్కడ చిత్రాలను చిత్రించారు. అజంతా గుహలు మనల్ని స్వాప్నిక జగత్తులోకి తీసుకొని వెడతాయని చెప్పి నెహ్రూ గారు అజంతా చిత్రకళను మెచ్చుకోవడం వాటి విశిష్టతను వెల్లడిస్తోంది.
ఇ) వాఘోరానది గురించి రాయండి.
జవాబు:
అజంతా గుహలు వాఘోరానది పుట్టిన చోటనే ఉన్నాయి. అజంతా గుహలను సమీపిస్తుంటే, రెండు వైపులా పచ్చని కొండలుంటాయి. ఆ రెండు కొండల మధ్య వాఘోరానది ఉంది. కొండలు అక్కడ ఎన్ని కనిపించినా, అవన్నీ ఒకే కొండ, ఆ కొండ చివర మెలికే వాఘోరానది జన్మస్థానం. కొండపైన ఏడు కొలనులు ఉన్నాయి. ఒక కొలను నుండి మరో కొలనులోకి ప్రవహిస్తూ 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద ధారగా వాఘోరా నది కొండ దిగువకు దూకుతుంది. దూకిన తరువాత కొండతో పాటు తాను కూడా మెలికలు తిరిగి, సమతల ప్రదేశానికి చేరి, కొన్ని వందల మైళ్ళు ప్రవహించి, ‘తపతి’ నదిలో కలుస్తుంది.
ఈ) నేడు అజంతా గుహలు ఏ స్థితిలో ఉన్నాయి?
జవాబు:
నేడు అజంతా గుహల గోడలు శిథిలావస్థలో ఉన్నాయి. గుహల గోడలకు మట్టి గిలాబా వేసి, దానిపై పలుచగా సున్నం పూసి తడి ఆరకముందే చిత్రాలను వేసినందువలన, అవి వానతేమకు పొడిపొడిగా వూడిపోయాయి. బందిపోటు దొంగలు పెట్టిన పొగకు కొన్ని చిత్రాలు మసిబారాయి. ఇటీవల కాలంలో కొంతమంది తమ కీర్తి సంపాదన కోసం గోళ్ళతో బొమ్మలపై తమ పేర్లను వ్రాసినారు. మరికొన్ని చిత్రాలు శిథిలావస్థలో ఉన్నాయి. అజంతా గుహలు మొత్తం 29. వీటిలో మూడింటిని ప్రారంభించి, పూర్తిచేయకుండానే ఆపివేశారు. ఈనాడు 13 గుహల్లోనే చిత్రాల శిథిలాలు కనిపిస్తున్నాయి. 1, 2, 9, 10, 11, 17 గుహల్లోనే చెక్కుచెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలున్నాయి. మొత్తం మీద నూటికి ఒకటవ వంతో, రెండవ వంతో చిత్రాలు మాత్రమే అజంతా గుహలలో నేడు మిగిలాయి.
ఉ) అజంతా శిల్పాలలో ఏమేమి ప్రతిబింబిస్తాయి?
జవాబు:
అజంతా చిత్రాలు భారతీయ జీవితాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఇవి ఒక విశాల ప్రపంచాన్ని, ఆశ నిరాశలతో, రాగ విద్వేషాలతో, ప్రేమ ద్వేషాలతో, సంతోష విషాదాలతో, కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. గౌతమ బుద్ధుని కారుణ్య సందేశం, మనుష్యులకే కాక, పశుపక్ష్యాదుల జీవితాన్ని సయితం ఎంత పవిత్రం చేసిందో, తేజోవంతం చేసిందో అనేదాన్ని, ఈ అజంతా శిల్పాలు ప్రతిబింబిస్తాయి. ప్రాచీన కాలంలోని భారత సాంఘిక వ్యవస్థ, ఏ రూపంలో ఉండేదో, ఆనాటి వృత్తులేవో, వ్యాసంగాలేవో, వినోదాలేవో తెలిసికోవాలనుకునేవారు అజంతా గుహలకు వెళ్ళి దర్శించాలి.
III. స్వీయరచన
1) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
అ) మేజర్ గిల్ వేటకు వెళ్ళి తొలిసారిగా అజంతా గుహలను దర్శించినట్టు చదివారు కదా ! దీనివలన మనదేశానికి జరిగిన మేలు ఏమని భావిస్తున్నారో రాయండి.
జవాబు:
మేజర్ గిల్ అనే బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ 1819లో వేటకు వెళ్ళి ఒక జంతువును తరుముకుంటూ కొండపైకి పోయి, ఎదురుగుండా గుబురు చెట్ల సందు నుంచి సాహసించి కొండ దిగాడు. వాఘోరా నదిని దాటి కొండలపై నుంచి చూశాడు. అల్లంత దూరంలో మేజర్ గిల్, వ్యూపాయింట్ ని చూశాడు.
ఆనాడు మేజర్ గిల్ అజంతా గుహలను దర్శించి మనకు వాటిని గూర్చి తెలపడం వల్ల మనకు ఎంతో మేలు జరిగింది. ప్రాచీనకాలంలో భారత సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేది ? అప్పటి వృత్తులేవి ? వ్యాసంగాలేవి ? ఇలాంటి ప్రశ్నలన్నిటికి సమాధానాలు ఈ చిత్రాల వల్ల లభిస్తున్నాయి. ఒకప్పుడు మనదేశంలో రాణ్మందిరాలు, రాణులు, రాజులు వారి వేషభాషలూ ఎలా ఉండేవో, వారు రాజసభలను ఎలా తీర్చేవారో అజంతా చిత్రాల వలన మనం తెలుసుకోగలుగుతున్నాము.
ఆ) జవహర్ లాల్ నెహ్రూ “అజంతా మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెళుతుంది” అన్నాడు. ఆయన ఈ మాట ఎందుకు అన్నాడో రాయండి.
జవాబు:
అజంతా గుహలను, మన తొలి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు దర్శించి, ఆ చిత్రాలను చూస్తే మన మనస్సు కలల ప్రపంచంలోకి వెడుతుంది అన్నారు.
అజంతా గుహల్లో అందమైన స్త్రీల చిత్రాలు అనేకం ఉన్నాయి. రాకుమార్తెలు, గాయనీమణులు, నృత్యాంగనలు మొదలయిన అనేక స్త్రీల చిత్రాలు అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్న స్త్రీల చిత్రాలలో కొందరు స్త్రీలు కూర్చున్నారు. కొందరు నిలబడి ఉన్నారు. మరి కొందరు ముస్తాబు చేస్తున్నారు. కొందరు ఊరేగింపుగా వెడుతున్నారు. ఈ అజంతా స్త్రీల చిత్రాలు, ఎంతో పేరు పొందాయి. అలాగే అక్కడ బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాలు ఉన్నాయి. అక్కడ చిత్రకారులు బుద్ధుని చిత్రాలను ఎంత శ్రద్ధతో అందంగా తీర్చిదిద్దారో, అంతే శ్రద్ధతో స్త్రీల చిత్రాలను సైతం, అందాలొలికేలా గీశారు.
అటువంటి అపురూప చిత్రాలను మనం కేవలం కలల్లోనే చూడగలం. వాస్తవిక లోకంలో చూడలేం. అందుకే నెహ్రూగారు, ఆ చిత్రాలు మనల్ని స్వాప్నిక జగత్తులోకి తీసుకువెడతాయి అని ప్రశంసించారు.
ఇ) “ప్రాచీన కాలంలో భారత సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేది? అప్పటి వృత్తులేవి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కోరితే అజంతా గుహలకు వెళ్ళాలి” ఇలా అనడం వెనుక నార్ల వేంకటేశ్వరరావు గారి భావం ఏమై ఉంటుందో రాయండి.
జవాబు:
అజంతా చిత్రాలలో భారతీయ జీవితం, సంస్కృతి తొణికిసలాడుతున్నాయి. వాటి ద్వారా వివిధ భారతీయ జీవితాల్ని గురించి, సంస్కృతి గురించి, వారి వృత్తులు మొదలైన ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలుగుతున్నాం. అజంతా చిత్రాల ద్వారా మన ప్రాచీన సాంఘిక వ్యవస్థ గురించి తెలుసుకోవచ్చు.
ఆ అజంతా చిత్రాలలో ఒకప్పుడు మనదేశంలో రాజమందిరాలు ఏ విధంగా ఉండేవో, రాజులు, రాణులు వేషభాషలు ఎలా ఉండేవో, వారు రాజసభలను ఎలా తీర్చుకొనేవారో తెలుస్తుంది. రాజుల సైనిక బల నిర్మాణం, వారి ఆయుధాలు, ఎలా ఉండేవో ఆ చిత్రాల వల్ల తెలుసుకోవచ్చు. అక్కడ చిత్రాలలో మన భారత సాయుధ దళాలు సింహళ దండయాత్ర చేసిన నౌకాదళ చిత్రాలున్నాయి. వీరశివాజీ, రాజ్యానికై సముద్రాలు దాటి వెళ్ళిన భారతదేశ వ్యక్తుల చిత్రాలున్నాయి. పర్ష్యన్ రాయబారులకు దర్శనం ఇచ్చిన మన భారతీయ రాజుల చిత్రాలు ఉన్నాయి. అందువల్లనే, నార్లవారు అజంతా చిత్రాల ద్వారా ఆనాటి భారత సాంఘిక వ్యవస్థ రూపం వెల్లడి అవుతుందని చెప్పారు.
ఈ) “అజంతా గుహలను చూడడానికి రెండు కళ్ళు చాలవు” అని రచయిత అన్నాడు కదా ! ఇలా “రెండు కళ్ళు చాలవు” అనే మాటను ఇంకా ఏయే సందర్భాలలో వాడతారు? కొన్నింటిని తెలపండి.
జవాబు:
ఎంత గొప్ప అందాన్ని అయినా, మనం మన రెండు కళ్ళతోనే చూడగలం. బాగా అందమైన వస్తువును ఎంత చూచినా, ఎంతగా చూచినా తృప్తి కలగదు. అలాంటప్పుడు ఆ అందాలను చూడ్డానికి రెండు కళ్ళూ చాలలేదు అని అంటారు.
నార్ల వేంకటేశ్వరరావుగారు అజంతా చిత్రాల అందం చూడ్డానికి మనకు ఉన్న రెండు కళ్ళూ చాలవు అన్నారు. అలాగే కింది సందర్భాల్లో కూడా రెండు కళ్ళూ చాలలేదు అంటూ ఉంటాము.
1. వేంకటేశ్వరస్వామిని గుడిలో ఆభరణాలతో అలంకరించినపుడు ఆ సొగసులను చూడ్డానికి మన రెండు కళ్ళూ చాలలేదని అంటాము.
2. చంటి పిల్లవాడిని చక్కగా అలంకరించి, తొట్టెలో వేసి ఊపుతాము. ఆ పిల్లవాడు బోసినవ్వులు నవ్వుతాడు. అప్పుడు కూడా, ఆ పిల్లవాడి బోసి నవ్వుల అందాలను చూడ్డానికి రెండు కళ్ళూ చాలలేదని అంటాము.
3. పెళ్ళి దుస్తులలో ఆకర్షణీయమైన అలంకరణలతో ధగధగా మెరిసిపోయే వధూవరులను చూడటానికి రెండు కళ్ళూ చాలవు అంటాము.
4. అతిలోక సౌందర్యరాశి అయిన స్త్రీని వర్ణించే సందర్భాల్లో ఆమె అందం చూసేందుకు రెండు కళ్ళూ చాలవు అంటాము.
2. కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.
అ) ప్రస్తుత పాఠ్యభాగం ద్వారా అజంతా గొప్పతనాన్ని వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.
“అజంతా, మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెళుతుంది” అన్న నెహ్రూ మాటలను సమర్థిస్తూ అజంతా గొప్పదనాన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
అజంతా గుహలు “జల్గామ్”కు దక్షిణంగా, 35 మైళ్ళదూరంలో, “ఔరంగాబాద్’కు ఉత్తరంగా 55 మైళ్ళ దూరంలో ఉన్నాయి. ఈ గుహలు వాఘోరా నది పుట్టిన చోటుననే ఉన్నాయి. నాల్గు పక్కలా కొండలు, పచ్చని చెట్లు, నీలాకాశం, అదొక కలలలోకం, భూలోక స్వర్గం. ‘మేజర్ గిల్’ అనే మిలటరీ ఆఫీసర్, 1819లో వేటకు వెళ్ళి, ఈ గుహలను మొదటగా చూశాడు. 30 సంవత్సరాలు కష్టపడి ఎన్నో చిత్రాలను కాపీ చేసుకొని వాటిని అతడు ‘లండన్ క్రిస్టల్ ప్యాలెస్’లో పెట్టాడు.
ఈనాడు మిగిలిన అజంతా చిత్రాలు, నూటికి రెండు మాత్రమే. అన్ని చిత్రాలూ మిగిలి ఉంటే, అజంతా గుహలు చూడ్డానికి మన రెండు కళ్ళూ చాలేవి కావు. అజంతా చిత్రాలలో సిద్ధార్థుని జాతక కథలే ఎక్కువ. జాతక కథలతో సంబంధం లేనివి కూడా ఉన్నాయి. ఆ కళా తపస్వులు, తమ కుంచెతో సౌందర్య సృష్టిని చేశారు.
అజంతా గుహలు మొత్తం 29. గుహల నిర్మాణం ప్రథమ శతాబ్దిలో మొదలై, ఏడవ శతాబ్ది వరకూ సాగింది. 14వ శతాబ్ది నాటి వరకూ మన అజంతా చిత్రాలంత అందమైన చిత్రాలు యూరప్ ఖండంలో లేనే లేవట. అజంతాలో ఎన్నో స్త్రీల అందమైన చిత్రాలున్నాయి. బుద్ధుని సుందర చిత్రాలున్నాయి.
అజంతా చిత్రాలలో భారతీయ జీవితం, సంస్కృతి తొణికిసలాడుతుంది. ఇంత అందమైన చిత్రాలు, ఏ విదేశీ చిత్రకారుడూ గీయలేడు. ఈ అజంతా చిత్రాలు ప్రాచీన కాలంలో మన భారతీయ సాంఘిక వ్యవస్థ స్వరూపాన్ని తెలుపుతాయి. ఆనాటి రాజుల మందిరాలు, వారి వేషభాషలూ, సైనిక వ్యవస్థను గూర్చి తెలుపుతాయి.
“అజంతా మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెడుతుంది” అని నెహ్రుగారిచే ప్రశంసించబడిన అజంతా గుహలను చిత్రకారులే కాదు భారతీయ సంస్కృతి, చరిత్ర, విజ్ఞానం మొదలైన విషయాల పట్ల శ్రద్ధాభక్తులు ఉన్న వారందరూ తప్పక దర్శించాలి.
ఆ) రచయిత అజంతా చూసి అక్కడి విశేషాలు రాశాడు కదా ! అలాగే మీరు చూసిన లేదా తెలుసుకొన్న ఒక దర్శనీయ స్థలానికి సంబంధించిన విషయాలు రాయండి.
(లేదా)
మనం కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనో చాలా ప్రదేశాలకు వెళుతుంటాం. మీరు చూసిన / తెలుసుకొన్న పర్యాటక స్థలం గురించి రాయండి.
జవాబు:
నేను ఇటీవల మా కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్‌లో పర్యటించాను. రాజస్థాన్ రాజధాని జైపూర్. తొలుత డబుల్ డెక్కర్ బస్సులో బయలుదేరి నగరాన్ని సందర్శించాం.
ముందుగా 1799లో మహారాజు సవాయి ప్రతాప్ సింగ్ కట్టించిన హవామహల్ కు వెళ్లాం. నెమలిపింఛంలా కనిపించే ఈ భవనాన్ని పునాదులు లేకుండా నిర్మించారు. పగలు గులాబీ రంగులోనూ రాత్రి బంగారు వర్ణంలోనూ శోభిల్లే ఈ ఐదంతస్తుల భవనంలో 300 గదులు, 953 కిటికీలు ఉన్నాయి. తరవాత బిర్లాలు నిర్మించిన లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్లాం. దీనికి ఓ పక్కనే జైపూర్ కోట కనిపిస్తుంటుంది.
తరవాత రాజస్థాన్ సాంస్కృతిక వైభవాన్ని జీవన విధానాన్ని ప్రతిబింబించే సిటీ మ్యూజియానికి వెళ్లాం. విశాలమైన జైపూర్ నగరంలో అన్ని కట్టడాలకూ గులాబీరంగే. అందుకే దీన్ని ‘పింక్ సిటీ’ అని పిలుస్తారు. జైపూర్ కోటలోపల భవంతులు, గదులు…. నాటి రాజవైభవాన్ని కళ్ళకు కడతాయి. బలమైన శత్రుదాడుల్ని ఎదుర్కొన్నప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఆ ప్రాచీన కట్టడాల నిర్మాణశైలిని మెచ్చుకోకుండా ఉండలేం.
జలమహల్ గా ప్రాచుర్యం పొందిన చమేలీ బాగ్ ను కూడా సందర్శించాం. జైపూర్ నుంచి రాజస్థాన్ లో అతి పెద్ద రెండో పట్టణంగా పేరొందిన జోధ్ పూర్ కి వెళ్ళాం. నగరం నవీన రాజప్రాసాదాలకు నిలయం. కళాఖండాలకూ, తోలు వస్తువులకూ ప్రసిద్ధిచెందిన ఈ నగరం మొత్తం నీలం రంగులో ఉన్న భవంతులే. అందుకే దీనికి ‘బ్లూ సిటీ’ అని పేరు.
మేము జైసల్మేర్ ను కూడా సందర్శించాం. మహారాజ్ జైసాల్ సింగ్ 1156లో నిర్మించిన ఈ నగరం, మనదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం. పాకిస్థాన్ కి మనకీ మధ్య గీతలు గీసుకున్న పట్టణం ఇదే. ఈ నగరంలో ఎటు చూసినా బంగారు వర్ణంలో మెరిసే భవంతులే. అందుకే దీన్ని ‘గోల్డెన్ సిటీ’ అంటారు. ఈ రోజుకీ రాజప్రాసాదం ప్రాంగణంలో 400 కుటుంబాలు నివసించడం ఈ కోట ప్రత్యేకత.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలున్నాయి. రాజస్థాన్ యాత్ర ఒక గొప్ప అనుభవం. నాకు ఎన్నో అవ్యక్త మధురానుభూతులను కలిగించింది. ఈ యాత్ర ద్వారా నేను అనేక విజ్ఞానదాయకమైన విషయాలను తెలుసుకున్నాను.
IV. పదజాలం
1. కింది వాక్యాలలోని జాతీయాలకు సరిపోయే అర్థం గ్రహించి సరైన సమాధానం కింద గీత గీయండి.
అ) అజంతా గుహలోని కుడ్యచిత్రాలు నేటికీ చెక్కుచెదరలేదు. .
i) చెదిరిపోలేదు
ii) ఏమీ పాడుకాలేదు
iii) చెక్కబడలేదు
iv) శిథిలం కాలేదు
జవాబు:
ii) ఏమీ పాడుకాలేదు
ఆ) దొంగలు అజంతా గుహల్లో తలదాచుకున్నారు.
i) తలను దాచుకున్నారు
ii) వస్తువులను దాచుకున్నారు
iii) ఆశ్రయం పొందారు
iv) నివసించారు
జవాబు:
iii) ఆశ్రయం పొందారు
ఇ) అజంతా చిత్రాలు భారతీయ సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.
i) కళ్ళకు కట్టుకున్నట్టు చూపుతున్నాయి
ii) కళ్ళముందు నిజంగా ఉన్నట్టు చూపుతున్నాయి
iii) చాలా మంచి విషయాలు చూపుతున్నాయి
iv) కళ్ళు చెదిరేట్టుగా ఉన్నాయి.
జవాబు:
iii) చాలా మంచి విషయాలు చూపుతున్నాయి
2. కింది వాక్యాలలో గీత గీసిన పదాన్ని మరో సందర్భానికి అన్వయించి వాక్యాలు తిరిగి రాయండి.
1. ఉదా : అనంతాకాశంలోని నక్షత్రాలను పరిశీలించి ఆ అనుభూతిని చెప్పగలమా?
మంచి కథను చదివితే గొప్ప అనుభూతి కలుగుతుంది.
జవాబు:
తాజ్ మహల్ ను సందర్శించినప్పుడు కలిగిన అనుభూతిని నేనెన్నటికీ మరువలేను.
అ. భారతీయ చిత్రకళ మహోన్నత శిఖరాలను అధిరోహించింది.
జవాబు:
సంగీతంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రతిభ, మహోన్నత శిఖరాలను తాకింది.
ఆ. చెక్కడపు పని మేజర్ గిల్ దృష్టిని ఆకర్షించింది.
జవాబు:
అనాథశరణాలయ విద్యార్థుల ప్రతిభ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇ. కాలగతిలో కొన్ని చిత్రాలు నశించాయి.
జవాబు:
అతడు తనకు కల్గిన దుఃఖాన్ని, కాలగతిలో మరచిపోయాడు.
ఈ. ఈ కుడ్యచిత్రాలను చిత్రించిన వారు బౌద్ధ భిక్షువులు.
జవాబు:
విజయనగర చక్రవర్తుల గృహాలలోని కుడ్యచిత్రాలలో లక్ష్మీనారాయణుల విగ్రహాలున్నాయి.
3. కింది వాక్యాలలోని పర్యాయపదాలను గుర్తించి వాటి కింద గీత గీయండి.
అ) హృదయాన్ని కదిలించే అనుభూతిని, ఆ ఎదలోని భావాలను సులభంగా వర్ణించలేం.
జవాబు:
హృదయం – ఎద
ఆ) వాఘోరానది కొండల చుట్టూ తిరుగుతూ ప్రవహించింది. ఆ వాహిని ప్రవహించే దృశ్యం మనోహరం.
జవాబు:
నది – వాహిని
ఇ) పడమటి గాలి సన్నగా వీస్తూంది. పశ్చిమ దిశ వైపు ఒక సుందరమైన తోట ఉంది.
జవాబు:
పడమర – పశ్చిమము
V. సృజనాత్మకత
* అజంతా చిత్రాల పాఠంలో అజంతా గుహల చరిత్ర, దాని విశేషాలూ చదివారు కదా ! అలాగే ప్రతి గ్రామానికీ ఒక చరిత్ర కానీ, విశేషం కానీ ఉండవచ్చు. మీ గ్రామానికి గల ప్రత్యేకతను లేదా మీకు దగ్గరలోని ఇతర గ్రామాల ప్రత్యేకతను వర్ణిస్తూ రాయండి. ఆ వివరాలతో ఒక బ్రోచర్ తయారుచేయండి.
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లాలో అల్లవరంలోని ‘కొంగరగిరిపట్టణం’ – ఇది కోరుకొండ రాజధానిగా ‘కుమారగిరి రాయలు’ పరిపాలించినపుడు ఆయన పేర వెలసిన గ్రామం. ఇది సముద్ర తీరంలోని గ్రామం. ప్రక్కన బంగాళాఖాతం ఉంది. పూర్వం సముద్రంలో ప్రయాణించే ఓడలు ఇక్కడ ఆగేవి. ఇప్పటికీ దాన్ని ‘ఓడలరేవు’ అంటారు. ఈ గ్రామం గుండా రామలక్ష్మణులు ప్రయాణించారు. అందులో రాముడు ‘నత్తా రామేశ్వరం’ అనే ప్రాంతంలో ఈశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించాడట. రాముడు ప్రతిష్ఠించడం వల్ల దాన్ని రామేశ్వరం అని పిలుస్తారు. మహాశివరాత్రికి మా చుట్టుపట్ల పల్లె గ్రామాల ప్రజలు సముద్రంలో స్నానం చేసి రామేశ్వరునికి అభిషేకాలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు.
అలాగే లక్ష్మణుడు మా గ్రామంలోనే ఒక ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దాన్ని ‘లక్ష్మణేశ్వరం’ అని పిలుస్తారు. సంక్రాంతికి ధనుస్సమయంలో ప్రజలు లక్ష్మణేశ్వరునికి అభిషేకాదులు చేస్తారు. ఇక్కడ సంక్రాంతి, కనుమనాడు ప్రభలతీర్థం చాలా వేడుకగా జరుగుతుంది. మా గ్రామ ప్రజలంతా వేడుకగా ఆ తీర్థంలో పాల్గొంటారు.
(లేదా)
* చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండల నుండి జలజల జాలువారే జలపాతాలు, పచ్చని ప్రకృతి శోభ, పక్షుల కిలకిలా రావాలతో ఆ ప్రదేశం ఎంతో సుమనోహరంగా ఉంది …….. ఇలా ఏదైనా ఒక ప్రాంతాన్ని వర్ణిస్తూ రాయండి.
జవాబు:
కోస్తా ప్రాంతములోని నెల్లూరు జిల్లాలో రావూరు ఒక చెప్పుకోదగిన తాలూకా. ఈ రావూరుకు సమీపంలో ఎత్తైన కొండలు ఉంటాయి. ఆ కొండల మధ్య నుంచి ఒక దారి ఉంది. కొండల మధ్యదారి మలుపులు తిరిగి మెలికలుగా ఉంటుంది. కొండల పైకి వెళ్ళిన తరువాత ఒక సుప్రసిద్ధమైన క్షేత్రం ఉంటుంది. దీనినే “పెంచలకోన” అని కూడా అంటారు. ఈ కోనలో కొండల మధ్య నుండి ఒక జలపాతం జాలువారుతూ ఉంటుంది. చుట్టూ కంటికింపైన పచ్చదనం, పక్షుల కిలకిల రావాలతో ఆ కొండ ప్రాంతమంతా చాలా ఆహ్లాదంగా, రమణీయంగా ఉంటుంది. ఇక్కడి పెంచలకోనలో నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఆ ఆలయానికి సందర్శకుల సందడి ఎక్కువగా ఉంటుంది.
VI. ప్రశంస
* మీరు చూసిన ఒక దర్శనీయ స్థలాన్ని కొనియాడుతూ ‘నీవు కూడా తప్పక చూడవలసింది’గా తెలుపుతూ మీ మిత్రుడికి లేఖ రాయండి.
జవాబు:
శ్రీకాకుళం, ప్రియమైన స్నేహితుడు శ్రీనాథ్ కు, నీ మిత్రుడు భరత్ సింహా వ్రాయునది. ఇక్కడ క్షేమము, అక్కడ క్షేమమని తలుస్తున్నాను. మేము ఇటీవల తీర్థయాత్రలకు వెళ్ళాము. అనేక ప్రదేశాలను దర్శించుకున్నాము. వాటిలో నాకు నచ్చినది కాణిపాక వరసిద్ధి వినాయకుల వారి ఆలయం. దాని గురించి ఈ లేఖలో వివరిస్తున్నాను. ఈ ఆలయం చిత్తూరు జిల్లాలోని తిరుపతికి దగ్గరగా రేణిగుంట సమీపాన ఉన్నది. ఇందు గణపతి శిల ఆకారంలో ఉంటాడు. ఈ వినాయకుడు మొదట ఒక రాయేనట. ఊరికి దగ్గరలోని ఒక పాడుబడిన బావిలో వినాయకుని ఆకారంలో వెలిసినాడట. తరువాత ఆ శిలావిగ్రహం కొంచెం పెద్దదిగా అయిందట. అప్పుడే ఆ గ్రామ ప్రజలు అందరూ ఆ విగ్రహానికి ఒక గుడి కట్టించి పూజలు చేయటం ప్రారంభించారట. అప్పటి నుండి కాణిపాకం చాలా ప్రసిద్ధి చెందినదట. ఇక్కడ ఎవరైనా కోరికలు కోరినట్లయితే తప్పక నెరవేరుతాయని ఇక్కడి ప్రజల యొక్క నమ్మకం. మా కుటుంబంలోని వారందరమూ ఈ ఆలయాన్ని దర్శించుకున్నాము. చాలా ఆనందించాము. నీవు కూడా తప్పకుండా ఇటువంటి దర్శనీయ ప్రాంతాన్ని దర్శించవలెను. తిరిగి లేఖ వ్రాయుము. మీ అమ్మా, నాన్నగార్లకు నా నమస్కారాలు. ఇట్లు చిరునామా : |
ప్రాజెక్టు పని
1. మీ జిల్లాలోని దర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రదేశాల చిత్రాలు సేకరించండి. వీటి వివరాలు రాయండి. వీటన్నిటితో ఒక సంకలనం తయారుచేసి ప్రదర్శించండి.
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లా.
దర్శనీయ స్థలాలు :
- అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయము.
- ద్రాక్షారామం , సామర్లకోట భీమేశ్వరాలయాలు.
- అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయము.
- రాజమండ్రి “గోదావరి కమ్ రైల్ బ్రిడ్జి”.
- కోనసీమ ప్రకృతి దృశ్యాలు.
- సముద్ర తీరం బీచు.
- రాజోలు తాలూకా ‘ఆదుర్రు’ బౌద్ధ స్తూపం – మొ||నవి.
VII. భాషను గురించి తెలుసుకుందాం!
1) కింది వాక్యాలను పరిశీలించి, మార్పులను గమనించండి.
అ) సంఘసంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు.
ఆ) సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి.
పై రెండు వాక్యాల అర్థం ఒక్కటే. కాని వాక్య నిర్మాణంలో భేదం ఉందని గమనించారు కదా !
రెండు వాక్యాల మధ్య భేదం ఏమిటి?
అ) సంఘసంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు – అనే ఈ మొదటి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంది. అంటే క్రియ కర్తను సూచిస్తుంది. కర్మకు ద్వితీయా విభక్తి ప్రత్యయం చేరి ఉంది. ఇలాంటి వాక్యాన్ని ‘కర్తరి వాక్యం’ అంటారు.
ఆ) ఇక సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. – అనే రెండవ వాక్యంలో (i) కర్తకు తృతీయా విభక్తి ప్రత్యయం ఉంది. (ii) క్రియకు “బడు” చేరింది. (iii) క్రియ – కర్మ ప్రధానంగా ఉంది.
వాక్యంలో క్రియకు ‘బడు’ చేరి, కర్తకు తృతీయా విభక్తి చేరే వాక్యాన్ని “కర్మణి వాక్యం” అంటారు.
2) కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
అ) వాల్మీకి రామాయణాన్ని రచించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
రామాయణం వాల్మీకి చేత రచించబడింది. (కర్మణి వాక్యం)
ఆ) ప్రజలు శాంతిని కోరుతున్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
శాంతి ప్రజలచేత కోరబడింది. (కర్మణి వాక్యం)
3) కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.
అ) లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నాచేత చదువబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకాన్ని చదివాను. (కర్తరి వాక్యం)
ఆ) నాచే రచించబడిన గ్రంథం నేతాజీ చరిత్ర. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను నేతాజీ చరిత్ర గ్రంథాన్ని రచించాను. (కర్తరి వాక్యం)
4) కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు తెలపండి.
సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
ఉదా : నదిగట్టు | నది యొక్క గట్టు | షష్ఠీ తత్పురుష |
అ) అజంతా స్త్రీలు | అజంతా యొక్క స్త్రీలు | షష్ఠీ తత్పురుష |
ఆ) ప్రకృతి సౌందర్యం | ప్రకృతి యొక్క సౌందర్యం | షష్ఠీ తత్పురుష |
ఇ) నదీ ప్రవాహం | నది యొక్క ప్రవాహం | షష్ఠీ తత్పురుష |
ఈ) మానవ సమాజం | మానవుల యొక్క సమాజం | షష్ఠీ తత్పురుష |
5) కింది విగ్రహవాక్యాలకు సమాస పదాలు రాసి దాని పేరును తెలపండి.
సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
అ) గుహల యొక్క గోడ | గుహల గోడ | షష్ఠీ తత్పురుష |
ఆ) కొండ యొక్క మలుపు | కొండ మలుపు | షష్ఠీ తత్పురుష |
వ్యాకరణంపై అదనపు సమాచారం
పర్యాయపదాలు
సముద్రం : సాగరం, జలధి
నక్షత్రం : తార, చుక్క
పువ్వు : కుసుమం, సుమం
కెరటం : అల, తరంగం, భంగం
కన్ను : నేత్రం, నయనం, చక్షువు
స్త్రీ : మహిళ, వనిత, మగువ
తావి: పరిమళం, సువాసన, సుగంధం
ఆకాశం : గగనం, నింగి
పాట : గీతం, గేయం
కొండ : అద్రి, పర్వతం
నది : వాహిని, స్రవంతి, కూలంకష
చంద్రుడు : సోముడు, అమృతాంశుడు
నీరు : జలం, వారి, ఉదకం
వ్యుత్పత్యర్థాలు
మిత్రుడు : అన్ని ప్రాణుల యందు సమభావన కలవాడు (సూర్యుడు)
తార : దీనిచే నావికులు తరింతురు (చుక్క)
పక్షి : పక్షములు గలది (పిట్ట)
సాగరం : సగర కుమారుల చేత త్రవ్వబడినది (సముద్రం)
మహీపాలుడు : భూమిని పాలించువాడు (రాజు)
నానార్థాలు
కోటి : నూరులక్షలు, అంచు, గుంపు
వర్షం : వాన, సంవత్సరం, మబ్బు
కన్ను : నేత్రం, బండి చక్రం
చిత్రం : బొమ్మ, ఆశ్చర్యం
దక్షిణ : దిక్కు సంభావన
తార : నక్షత్రం, వాలి భార్య, కంటిపాప, ఓంకారం
కుడ్యం : గోడ, పుంత
ఉత్తరం : జాబు, సమాధానం
సంధులు
సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు దాని దీర్ఘము ఏకదేశమగును.
నీలాకాశం = నీల + ఆకాశం – సవర్ణదీర్ఘ సంధి
కళాభిజ్ఞులు = కళ + అభిజ్ఞులు – సవర్ణదీర్ఘ సంధి
చంద్రాకారం = చంద్ర ఆకారం – సవర్ణదీర్ఘ సంధి
శతాబ్దం = శత + అబ్దం – సవర్ణదీర్ఘ సంధి
సిద్ధార్థ = సిద్ధ + అర్థ – సవర్ణదీర్ఘ సంధి
న్యత్యాంగన = నృత్య + అంగన – సవర్ణదీర్ఘ సంధి
గుణసంధి :
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
మహోన్నత = మహా + ఉన్నత – గుణసంధి
గజేంద్రుడు = గజ + ఇంద్రుడు – గుణసంధి
సర్వోత్తమం = సర్వ + ఉత్తమం – గుణసంధి
ఉత్వసంధి :
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
సులభమేమో = సులభము + ఏమో – ఉత్వ సంధి
అపారమైన = అపారము + ఐన – ఉత్వ సంధి
వచ్చినావని = వచ్చినావు + అని – ఉత్వ సంధి
మలుపులన్నీ = మలుపులు + అన్ని – ఉత్వ సంధి
లోతైనా = లోతు + ఐనా – ఉత్వ సంధి
చైత్యా లైతే = చైత్యాలు + ఐనా – ఉత్వ సంధి
అటొక = అటు + ఒక – ఉత్వ సంధి
పేరొందు = పేరు + ఒందు – ఉత్వ సంధి
ఆత్వసంధి :
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
నిలిచినప్పుడు = నిలిచిన + అప్పుడు – అత్వ సంధి
పోయినందున = పోయిన + అందున – అత్వ సంధి
అల్లంత = అల్ల + అంత – అత్వ సంధి
దక్కకుండు = దక్కక + ఉండు – అత్వ సంధి
ఇత్వగుంధి (అ):
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
దారైనా = దారి + ఐనా – ఇత్వ సంధి
అదొక = అది + ఒక – ఇత్వ సంధి
ఇత్వసంధి (ఆ) :
సూత్రం : క్రియా పదాల్లో ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
లేనట్టు = లేని + అట్టు – ఇత్వ సంధి
వచ్చేదట = వచ్చేది + అట – ఇత్వ సంధి
ఉండేదేమో = ఉండేది + ఏమో – ఇత్వ సంధి
యణాదేశ సంధి :
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమంగా య, వ, రలు ఆదేశమవుతాయి.
పక్ష్యాదులు = పక్షి + ఆదులు – యణాదేశ సంధి
ప్రత్యుత్తరం = ప్రతి + ఉత్తరం – యణాదేశ సంధి
పుంప్వాదేశ సంధి :
సూత్రం : కర్మధాయంలో మువర్ణకానికి పుంపులు అవుతాయి.
సముద్రపు అంచు = సముద్రపు + అంచు – పుంప్వాదేశ సంధి
చెక్కడపుపని = చెక్కడము + పని – పుంప్వాదేశ సంధి
గసడదవాదేశ సంధి :
సూత్రం : ప్రథమమీది పురుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
చెట్టుగాని = చెట్టు + కాని – గసడదవాదేశ సంధి
చరిత్రలుగా = చరిత్రలు + కా – గసడదవాదేశ సంధి
సరిగదా = సరి + కదా – గసడదవాదేశ సంధి
యడాగమ సంధి :
సూత్రం : సంధి లేనిచోట స్వరం కంటె పరంగా ఉన్న స్వరానికి యడాగమం అవుతుంది.
ఆయన యెత్తినట్లు = ఆయన + ఎత్తినట్లు – యడాగమ సంధి
తలయెత్తు = తల + ఎత్తు – యడాగమ సంధి
సమాసాలు
సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
వేషభాషలు | వేషమును, భాషయును | ద్వంద్వ సమాసం |
భక్తిశ్రద్ధలు | భక్తియును, శ్రద్ధయును | ద్వంద్వ సమాసం |
శ్రద్ధాభక్తులు | శ్రద్ధయును, భక్తియును | ద్వంద్వ సమాసం |
ఆశనిరాశలు | ఆశయును, నిరాశయును | ద్వంద్వ సమాసం |
ప్రకృతి సౌందర్యం | ప్రకృతి యందలి గల సౌందర్యం | సప్తమీ తత్పురుష సమాసం |
అజంతా గుహలు | అజంతా యొక్క గుహలు | షష్ఠీ తత్పురుష సమాసం |
రాణ్మందిరాలు | రాణుల యొక్క మందిరాలు | షష్ఠీ తత్పురుష సమాసం |
రాజసభ | రాజు యొక్క సభ | షష్ఠీ తత్పురుష సమాసం |
జీవిత చరిత్ర | జీవితము యొక్క చరిత్ర | షష్ఠీ తత్పురుష సమాసం |
చంద్రాకారం | చంద్రుని యొక్క ఆకారం | షష్ఠీ తత్పురుష సమాసం |
– నదిగట్టు | నది యొక్క గట్టు | – షష్ఠీ తత్పురుష సమాసం |
అగ్నిప్రమాదం | అగ్ని వలన ప్రమాదం | పంచమీ తుత్పురుష సమాసం |
పచ్చని చెట్లు | పచ్చనైన చెట్లు | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
శాశ్వత కీర్తి | శాశ్వతమైన కీర్తి | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
అనంతాకాశం | అనంతమైన ఆకాశం | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
ముప్పది సంవత్సరాలు | ముప్పదైన సంవత్సరాలు | ద్విగు సమాసం |
పదమూడు గుహలు | పదమూడైన గుహలు | ద్విగు సమాసం |
వాఘోరానది | వాఘోర అను పేరుగల నది | సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం |
ప్రకృతి – వికృతులు
హృదయం – ఎద, డెందము
ఆకాశం – ఆకసం
యాత్ర – జాతర
కథ – కత
పుష్పం – పూవు
చంద్రుడు – చందురుడు
దూరం – దవ్వు
సముద్రము – సంద్రము
రూపం – రూపు
గృహము – గీము
స్త్రీ – ఇంతి
దక్షిణం – దక్కినం
రచయిత పరిచయం
పాఠం పేరు : “అజంతా చిత్రాలు”
వ్యాస రచయిత : “నార్ల వేంకటేశ్వరరావు”
జననం, జన్మస్థలం : నార్ల వారు, 1908 డిశంబరు ఒకటవ తేదీన (1-12- 1908)న కృష్ణా జిల్లాలోని “కవుతరం” అనే గ్రామంలో జన్మించారు.
రచనలు :
1. “రష్యన్ కథలు” (అనువాద రచన)
2. “నరకంలో హరిశ్చంద్రుడు” (నాటకం)
3. “నార్లవారి మాట” (పద్యకావ్యం) మొదలయిన గ్రంథాలు రాశారు.
మేధావి : ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు. నిరంతరం, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన మేధావి.
రచనాశైలి : నార్లవారి రచన సరళమైన శబ్దాలతో సొగసైన భావాలతో సుందరశైలిలో సాగుతుంది.
కఠిన పదాలకు – అర్థాలు
దృశ్యము = కంటికి ఇంపయినది (చూడదగినది)
అనుభూతి = సుఖ దుఃఖాదులను పొందడం (ప్రత్యక్షజ్ఞానం)
అపారము = అధికమైనది (అవధిలేనిది)
బస్తీ = పట్టణము
దిశ్చక్రాన్ని = దిక్కుల యొక్క చక్రమును
నెత్తావులు (నెలు + తావులు) = నిండు పరిమళములు
తావులు = సువాసనలు
జగత్తు = లోకము
ఆదిలో = మొదటిలో
శిరోభాగము (శిరః + భాగము) = పై భాగము
వ్యవధి = గడువు
ఘట్టం = సమయం
పరికించు = చూచు
బయలు = స్థలము
అస్తిత్వాన్ని = ఉనికిని
సభ్యలోకం = ఉత్తమ సమాజం
విస్మరించింది = మరచింది
కుడ్యచిత్రాలు = గోడ బొమ్మలు
స్వాప్నిక జగత్తు = కలల లోకము
గాయనీమణులు = శ్రేష్ఠులైన పాటకత్తెలు
నృత్యాంగనలు = నాట్యం చేసే స్త్రీలు
అలౌకిక సుందర విగ్రహము = లోక సహజం కాని, అందమైన విగ్రహము
బౌద్ధచైత్యాలు = బౌద్ధస్తూపములు
కుడ్యాన్ని = గోడను
మట్టిగిలాబా = మట్టితో పూత
దగ్గము = కాలినది
రాగవిరాగాలు = అనురాగము, అనురాగం లేకపోవడం
కళాతపస్వులు = ఉత్తమ కళాకారులు
సౌందర్యసృష్టి = అందాన్ని సృష్టించడం
కళాభిజ్ఞులు (కళా + అభిజ్ఞులు) = కళలలో నేర్పరులు
తొణికిసలాడుతున్న = చిందుతున్న
విజాతీయ చిత్రకారులు = ఇతర జాతి చిత్రలేఖకులు
ప్రజాసాధకులు = ప్రజ్ఞను సాధించినవారు
వ్యాసంగము = ఎక్కువ కృషి
రాణ్మందిరాలు రాట్ + మందిరాలు = రాజమందిరాలు
వణిక్కులు = వర్తకులు
మహీపాలకులు = రాజులు
కారుణ్య సందేశం = దయతో కూడిన ఆజ్ఞ
పునీతం = పవిత్రము
AP Board Textbook Solutions PDF for Class 8th Telugu
- AP Board Class 8 Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 1 అమ్మకోసం Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 3 నీతి పరిమళాలు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 4 అజంతా చిత్రాలు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 5 ప్రతిజ్ఞ Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 6 ప్రకృతి ఒడిలో Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 7 హరిశ్చంద్రుడు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 8 జీవన భాష్యం Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 9 సందేశం Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 10 సంస్కరణ Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 11 భూదానం Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu ఉపవాచకం Chapter 2 గుశ్వం Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu వ్యాసాలు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu లేఖలు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Grammar Textbook Solutions PDF
0 Comments:
Post a Comment