![]() |
AP Board Class 8 Telugu Chapter 5 ప్రతిజ్ఞ Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 8th Telugu Chapter 5 ప్రతిజ్ఞ Book Answers |
Andhra Pradesh Board Class 8th Telugu Chapter 5 ప్రతిజ్ఞ Textbooks Solutions PDF
Andhra Pradesh State Board STD 8th Telugu Chapter 5 ప్రతిజ్ఞ Books Solutions with Answers are prepared and published by the Andhra Pradesh Board Publishers. It is an autonomous organization to advise and assist qualitative improvements in school education. If you are in search of AP Board Class 8th Telugu Chapter 5 ప్రతిజ్ఞ Books Answers Solutions, then you are in the right place. Here is a complete hub of Andhra Pradesh State Board Class 8th Telugu Chapter 5 ప్రతిజ్ఞ solutions that are available here for free PDF downloads to help students for their adequate preparation. You can find all the subjects of Andhra Pradesh Board STD 8th Telugu Chapter 5 ప్రతిజ్ఞ Textbooks. These Andhra Pradesh State Board Class 8th Telugu Chapter 5 ప్రతిజ్ఞ Textbooks Solutions English PDF will be helpful for effective education, and a maximum number of questions in exams are chosen from Andhra Pradesh Board.Andhra Pradesh State Board Class 8th Telugu Chapter 5 ప్రతిజ్ఞ Books Solutions
Board | AP Board |
Materials | Textbook Solutions/Guide |
Format | DOC/PDF |
Class | 8th |
Subject | Telugu |
Chapters | Telugu Chapter 5 ప్రతిజ్ఞ |
Provider | Hsslive |
How to download Andhra Pradesh Board Class 8th Telugu Chapter 5 ప్రతిజ్ఞ Textbook Solutions Answers PDF Online?
- Visit our website - Hsslive
- Click on the Andhra Pradesh Board Class 8th Telugu Chapter 5 ప్రతిజ్ఞ Answers.
- Look for your Andhra Pradesh Board STD 8th Telugu Chapter 5 ప్రతిజ్ఞ Textbooks PDF.
- Now download or read the Andhra Pradesh Board Class 8th Telugu Chapter 5 ప్రతిజ్ఞ Textbook Solutions for PDF Free.
AP Board Class 8th Telugu Chapter 5 ప్రతిజ్ఞ Textbooks Solutions with Answer PDF Download
Find below the list of all AP Board Class 8th Telugu Chapter 5 ప్రతిజ్ఞ Textbook Solutions for PDF’s for you to download and prepare for the upcoming exams:8th Class Telugu 5th Lesson ప్రతిజ్ఞ Textbook Questions and Answers
చదవండి – ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
పై చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి.
జవాబు:
పై చిత్రంలో కుమ్మరివాడు కుండలను తయారుచేస్తున్నాడు. కమ్మరి కొలిమిలో ఇనుప పనిముట్లు తయారుచేస్తున్నాడు. రైతు ఎద్దులతో పొలం దున్నుతున్నాడు. చేనేత కార్మికుడు మగ్గం నేస్తున్నాడు. ఒకామె కడవతో నీరు పట్టుకెడుతోంది. మరొకామె గంపతో సరుకులు తీసుకువెడుతోంది. పాలేరు గడ్డిమోపు మోస్తున్నాడు. కార్మికులు మరమ్మతుపని చేస్తున్నారు. జాలరి చెరువులో వల విసురుతున్నాడు.
ప్రశ్న 2.
ఆహారోత్పత్తి వెనుక ఉన్న కష్టాన్ని గురించి చెప్పండి.
జవాబు:
పంటలు పండించాలంటే, రైతులు ఎంతో కష్టపడాలి. ముందుగా పొలాల్ని నాగలితో దున్నాలి. చేనుకు నీరు పెట్టాలి. నారుమడి వేయాలి. నారును పెంచాలి. నారు తీసి పొలంలో నాటాలి. నీరు పెట్టాలి. కలుపు తీయాలి. పురుగు మందులు కొట్టాలి. ఎరువులు వేయాలి. చేను కోయాలి. ఆరబెట్టాలి. ధాన్యాన్ని నూర్చాలి. ధాన్యం ఎగురపోయాలి. సంచులలో ధాన్యం పోసి అమ్మాలి. దాన్ని మరల ద్వారా ఆడించాలి. ఇంత చేస్తే కాని బియ్యం, గోధుమ పిండి వంటివి మనకు లభించవు.
ప్రశ్న 3.
మనం వాడే ప్రతి వస్తువు తయారీ వెనుక ఉన్న శ్రమను గురించి చెప్పండి.
జవాబు:
మనం అనేక రకాల పనిముట్లు ఉపయోగిస్తాం. వాటి వెనుక ఎందరో కష్టజీవుల శ్రమ ఉంది. కమ్మరి కొలిమిలో ఇనుమును కాల్చి సమ్మెటపై బాది సాగదీసి కత్తి, కొడవలి, గొడ్డలి, గునపం, పార, నాగలి కొట్టు వగైరా తయారుచేస్తాడు. కుమ్మరి కుండలు, వంట పాత్రలు చేస్తాడు. సాలె మగ్గంపై మనకు బట్టలు వేస్తాడు. వడ్రంగి, ఇళ్ళకు గుమ్మాలూ, తలుపులూ వగైరా చేస్తాడు. ఇంకా ఎందరో కార్మికులు కార్యానాలలో, యంత్రాల దగ్గర పనిచేసి మనం వాడుకొనే వస్తువులు తయారుచేస్తున్నారు. ఇలా మనం వాడుకొనే ప్రతి వస్తువు వెనుక కార్మికుల శ్రమ, కష్టం, కృషి ఉంది.
ప్రశ్న 4.
కర్షకుడు, కార్మికుడు లేకపోతే ఏమౌతుందో ఆలోచించి చెప్పండి.
జవాబు:
కర్షకుడు, కార్మికుడు వీరిద్దరూ దేశానికి వెన్నెముకలాంటివారు. కర్షకుడు లేకపోతే మనకు తిండిలేదు. కార్మికుడు లేకపోతే, మనం వాడుకోవడానికి ఏ రకమైన పనిముట్లు, నిత్యావసర వస్తువులు, సైకిళ్ళు, కార్లు, విమానాలు, రైళ్ళు కూడా ఉండవు. ప్రతి వస్తువు వెనుక కార్మికుని కష్టం దాగి ఉంది.
ఇవి చేయండి
I. వినడం – మాట్లాడడం
ప్రశ్న 1.
కార్మికుల, కర్షకుల సౌభాగ్యం అంటే ఏమిటి ? మాట్లాడండి.
జవాబు:
కార్మికులు వారి శ్రమకు తగినట్టుగా ప్రతిఫలాన్ని పొందలేక బాధపడుతున్నారు. కర్షకులు కూడా ఎంతో శ్రమతో, చమటోడ్చి పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలవుతున్నాడు.
వీరికి ‘సౌభాగ్యం’ అంటే వారికి చేతినిండా పని ఉండి వారు, వారి భార్యాబిడ్డలతో సుఖంగా జీవించగలగడం. పారిశ్రామిక కార్మికులకు యజమానులు శ్రమకు తగిన జీతాలు ఇవ్వడం, కార్మికుల పిల్లలకు విద్యాసదుపాయాలు కలుగజేయడం, కార్మికులకు వైద్యసదుపాయాలు కలుగజేయడం వంటి వాటిని వారి సౌభాగ్యంగా భావించాలి.
ఇక వ్యవసాయ కార్మికులకు సంవత్సరమంతటా పని ఉండదు. ఆ పని లేని రోజుల్లో కూడా వారి జీవితం సుఖంగా నడిచే ఏర్పాట్లు అనగా ‘పనికి ఆహార పథకం, రోజ్ గార్ పథకం’ వంటివి ఏర్పాటు చేయడం జరగాలి.
ప్రశ్న 2.
‘కర్షకుడు, కార్మికుడు’ చేస్తున్న సేవను గురించి చర్చించండి.
జవాబు:
కర్షకులు, విరామ మెరుగని కష్టజీవులు. మూడువందల అరవై రోజులూ శ్రమించి వ్యవసాయం పనులు చేసి, మనకు ఆహారానికి కావలసిన ఆహార ధాన్యాలను పండిస్తున్నారు. వారు పశువులను మేమే, మనకు కావలసిన పాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక కార్మికులు, మనకు కావలసిన నిత్యావసర వస్తువుల్నీ వ్యవసాయ పనిముట్లనూ ఉత్పత్తి చేస్తున్నారు. యంత్రాల ద్వారా వస్తువులు తయారవుతున్నా, అక్కడ కార్మికులు లేనిదే యంత్రాలు నడవవు. వస్తువులు ఉత్పత్తి కావు.
కార్మికులు, కర్షకులు తమ పనిని మానివేస్తే, మనకు తిండి ఉండదు. వాడుకోవడానికి వస్తువులు ఉండవు. మన సుఖజీవనానికి వారే ప్రాణాధారం అని గుర్తించాలి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మేదరి, తాపీమేస్త్రీ ఇలా వీరందరూ పని చేయకపోతే ప్రపంచమే స్తంభించిపోతుంది.
ప్రశ్న 3.
శ్రీశ్రీ రాసిన కవిత విన్నారు కదా ! ఇలాంటి కవితను ఆయన ఎందుకు రాసి ఉంటారు ? ఊహించి చెప్పండి.
జవాబు:
మానవ సుఖజీవనానికి కార్మికులు, కర్షకులే ప్రాణాధారమని, దేశ సౌభాగ్యం కోసం వారు ఎనలేని సేవలందిస్తున్నారని, సకల వృత్తులకు సమ ప్రాధాన్యం గలదని, శ్రమైక జీవనంలోనే మాధుర్యం నిండి ఉందని తెలపడానికి శ్రీశ్రీ ఈ కవిత రాశాడు. కార్మికులూ, కర్షకులూ మానవ జీవిత గమనానికి అతిముఖ్యులని, వారు సౌఖ్యంగా జీవించేలా చూడవలసిన బాధ్యత ధనిక స్వాములపై ఉందనీ, సమాజంపై ఉందని చెప్పడానికే శ్రీశ్రీ ఈ కవిత రాశాడు. రష్యాలో వచ్చిన కార్మిక విప్లవం ప్రభావంతో, స్పందించిన శ్రీశ్రీ ఈ కవిత రాశాడు.
కేవలం రాజులూ, రాణులూ వారి ప్రేమ పురాణాలూ మాత్రమే కవితా వస్తువులు కావనీ, శరీర కష్టాన్ని తెలిపే గొడ్డలి, రంపం వంటి పనిముట్లు, వాటితో పనిచేసే కర్షక, కార్మికులు కూడా కవితా వస్తువులే అని, చెప్పడానికి అభ్యుదయ భావాలతో శ్రీశ్రీ ఈ కవిత రాశాడు.
II. చదవడం, అవగాహన చేసుకోవడం
1. పాఠం చదవండి. కింది పట్టికను పూరించండి. వృత్తులు
వృత్తులు | వాడే పనిముట్లు |
ఉదా : జాలరి | పగ్గం |
1. …………………… | …………………… |
2. …………………… | …………………… |
3. …………………… | …………………… |
4. …………………… | …………………… |
జవాబు:
వృత్తులు | వాడే పనిముట్లు |
ఉదా : జాలరి | పగ్గం |
1. సాలెలు | మగ్గం |
2. కుమ్మరి | చక్రం |
3. కమ్మరి | కొలిమి |
4. కంసాలి | సుత్తి |
2. కింది కవితను చదివి, నాలుగు ప్రశ్నలు తయారుచేయండి.
పర్వతం ఎవడికీ వంగి సలాం చేయదు
సముద్రం ఎవడికాళ్ళకిందా మొరగదు
నేనింతా పిడికెడు మట్టే కావచ్చు
కానీ కలమెత్తితే నాకు
ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది.
జవాబు:
ప్రశ్నలు:
1) ఎవరికీ వంగి సలాం చేయనిది ఏది?
2) ఎవడి కాళ్ళ కిందా మొరగనిది ఏది?
3) చివరికి నేను ఏమవుతాను?
4) కలమెత్తితే నాకు ఏమవుతుంది?
3. పాఠం చదవండి. పాఠంలో కొన్ని ప్రాసపదాలు ఉన్నాయి. వాటి కింద గీత గీయండి. చదవండి.
ఉదా : పొలాలనన్నీ – హలాలదున్నీ – హేమం పిండగ – సౌఖ్యం నిండగ
జవాబు:
పరిశ్రమించే – బలికావించే
కురిపించాలని – వర్ధిల్లాలని
కళ్యాణానికి – సౌభాగ్యానికి
వినుతించే విరుతించే
ఘర్మజలానికి – ధర్మజలానికి
పరిక్లమిస్తూ – పరిప్లవిస్తూ
సంధానిస్తూ – సంరావిస్తూ
నవీనగీతికి – నవీనరీతికి
4. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.
అ) రైతు తన జీవితాన్ని ఎందుకు ధారపోస్తున్నాడు?
జవాబు:
రైతు నాగలిని నమ్ముకొన్నవాడు. అతడు పొలాలకు తన జీవితాన్ని ధారపోసి భూమిలో బంగారుపంటలు పండించాలనీ, లోకానికి అంతా సౌఖ్యం నిండుగా ఉండాలనీ, పొలాలను నాగళ్ళతో దున్నుతున్నాడు. విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నాడు. తన బలాన్ని అంతా, నేల తల్లికి ధారపోస్తున్నాడు.
ఆ) శ్రీశ్రీ తన నవ్య కవిత్వాన్ని ఎవరికి సమర్పిస్తానన్నాడు?
జవాబు:
శ్రీశ్రీ తన నవ్య కవిత్వాన్ని, కార్మికుల కల్యాణానికీ, శ్రామికుల సౌభాగ్యానికి సమర్పిస్తానన్నాడు. ముల్లోకాలలో, మూడు కాలాల్లో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదని, తెలుపుతానన్నాడు. కష్టజీవులూ, కర్మవీరులూ అయిన కార్మికులకు, నిత్యమంగళం నిర్దేశిస్తానన్నాడు. వారికి స్వస్తి వాక్యములు పలుకుతానన్నాడు. స్వర్ణ వాద్యములు మ్రోగిస్తూ, ఆర్త జీవుల వేదనలే పునాదిగా, భావివేదములు లోకానికి వినిపిస్తానన్నాడు.
ఇ) శ్రీశ్రీ దేనికి ఖరీదు కట్టలేమన్నాడు?
జవాబు:
ఆరుగాలం శ్రమించి తమ బలాన్ని భూమికి ధారపోసే కర్షక వీరుల శరీరంపై ప్రవహించే ఘర్మజలానికి, ఖరీదు కట్టలేమన్నాడు. గనుల్లో, అడవుల్లో, కార్యానాల్లో పనిచేస్తూ, ధనవంతులైన యజమానులకు దాస్యం చేస్తూ, యంత్రాలతో పనిచేసే కార్మికుల కళ్ళల్లో కణ కణ మండే విలాపాగ్నులకూ, గల గలా తొణకే విషాదపు కన్నీళ్లకూ ఖరీదు కట్టలేమన్నాడు.
ఈ) కార్మిక వీరుల కన్నులను కవి ఎలా వర్ణించాడు?
జవాబు:
కార్మిక వీరుల కన్నుల నిండా, కణ కణ మండే విలాపాగ్నులు ఉంటాయనీ, గల గలా ప్రవహించే దుఃఖపు కన్నీళ్ళు ఉంటాయనీ కవి వర్ణించాడు.
ఉ) శ్రీశ్రీ వేటిని పాటలుగా రాస్తానన్నాడు?
జవాబు:
లోకంలో జరిగే అన్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్ర్యములు, దౌర్జన్యములు, పరిష్కరించే, బహిష్కరించే – దారులు తీస్తాననీ, ఆ విషయాన్ని పాటలుగా రాస్తాననీ శ్రీ శ్రీ అన్నాడు.
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) కర్షకుల శ్రమను గురించి రాయండి.
జవాబు:
విరామమంటే తెలియని కష్టజీవి కర్షకుడు. నాగలిని నమ్ముకొని బతికేవాడు. పంటపొలాలకే తన జీవితాన్ని ధారపోసి పంటను పండిస్తాడు. చేలు దున్నడం, నీరు పెట్టడం, గట్టు లంకలు కొట్టడం, తొరేలు వేయడం, నారుమళ్ళు పోయడం, నారు తీయడం, ఊడ్చడం, ఎరువులు వేయడం, పంట పండాక కోత కోయడం, మోపులు కట్టడం, ధాన్యం నూర్చడం, ఎగుర పోయడం, బస్తాలకు కట్టడం, బళ్ళపై ఇళ్ళకు చేర్చడం, వాటిని అమ్మడం – ఇలా కర్షకులు నిత్యం ఎంతో శ్రమపడతారు.
ఆ) కార్మికులంటే ఎవరు? వారి జీవన విధానం ఎలా ఉంటుందో ఆలోచించి రాయండి.
జవాబు:
కార్మికులు అంటే చేతివృత్తుల వారు. అలాగే పరిశ్రమలలో యంత్రాల వద్ద పనిచేసే సహాయకులు. ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసే వారు రోజుకు 8 గంటలు పనిచేయాలి. భోజనానికి మాత్రం విరామం ఇస్తారు. వీరు పరిశ్రమల్లో రసాయనిక పదార్థాల గాలులను పీలుస్తూ, పరిశ్రమల ముడిపదార్థాలను యంత్రాల వద్దకు చేరుస్తూ, వాటిని ఎత్తుతూ కష్టపడాలి. సామాన్యంగా వీరికి ఆ వాతావరణం పడక అనారోగ్యం వస్తూ ఉంటుంది.
ఇళ్ళ వద్ద పనిచేసే కమ్మరి, కుమ్మరి, మేదరి వంటి వారు తమకు పని ఉన్నంత సేపూ పని చేస్తారు. తాపీ, వడ్రంగి, ఇనుప పనివారలు రోజుకు ఏడు, ఎనిమిది గంటలు ఎండల్లో నిలబడి పనిచేయాలి.
ఇ) ప్రపంచమంతా భాగ్యంతో ఎప్పుడు వర్ధిల్లుతుంది?
జవాబు:
కర్షకులు, కార్మికులు సుఖసంతోషాలతో ఉంటే ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది. సకాలంలో వర్షాలు కురిసి, వరదలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది.
పరిశ్రమలలో కార్మికులు సమ్మెలు, బండ్లు లేకుండా యజమానులతో సామరస్యంగా ఉండి మంచి ఉత్పత్తిని సాధిస్తే, ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది.
ప్రభుత్వమూ, పారిశ్రామికవేత్తలూ, కర్షకుల, కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి. వ్యవసాయ కూలీలకు 365 రోజులూ పని చూపించాలి. కార్మికులకూ, కర్షకులకూ పెన్షనులు ఏర్పాటు చేయాలి. కార్మిక, కర్షకుల పిల్లలకు విద్యా, వైద్య సదుపాయాలు, స్కాలర్ షిప్పులూ ఇవ్వాలి. అప్పుడే ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది.
ఈ) అభాగ్యులను, అనాథలను చూస్తే మీకేమనిపిస్తుందో రాయండి.
జవాబు:
అభాగ్యులను, అనాథలను చూస్తే, నాకు బాధ కలుగుతుంది. నా మిత్రులతో, నా తల్లిదండ్రులతో చెప్పి, వారికి సాయం చేద్దామనిపిస్తుంది. అభాగ్యులకు, అనాథలకు ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తే బాగుండుననిపిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయంలో చొరవ చూపితే మేలనిపిస్తుంది. ధనవంతులు అభాగ్యులు, అనాథల కన్నీళ్ళు తుడవాలనీ, వారికి అండగా నిలిచి ఆదుకోవాలని అనిపిస్తుంది.
2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటలలో రాయండి.
జవాబు:
‘రైతు విరామ మెరుగని కష్టజీవి. ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలని కోరేవాడు అతను. నాగలిని చేతపట్టి పొలాలను దున్ని బంగారాన్ని పండిస్తాడు. తన శరీరంలోని ప్రతి చెమట బొట్టును దేశానికే ధారపోయాలనుకుంటాడు. లోకానికి సుఖం కలిగేందుకు విశ్రాంతి లేకుండా కష్టపడుతున్న రైతుల చెమటకు విలువ కట్టలేము.
కార్మికుడు ప్రపంచమంతా సంపదలతో తులతూగాలని కోరుకుంటాడు. తమ నరాల చేతుల సత్తువతో, వరహాల వర్షం కురిపించాలని, ప్రపంచ సౌభాగ్యం కోసం, గనుల్లో, అడవుల్లో, కార్యానాల్లో కష్టపడుతూ, ధనవంతులకు దాస్యం చేసే కార్మికుల కళ్ళల్లో మండే దుఃఖాగ్నికి, కారే కన్నీళ్ళకూ ఖరీదు కట్టలేము.
కాబట్టి లోకంలో అన్యాయాలు, ఆకలి, బాధ, దరిద్రం, దౌర్జన్యం పోయే విధంగా పాటలు రాస్తాను. నా కొత్త కవిత్వం కార్మికుల, శ్రామికుల సౌభాగ్యానికి సమర్పిస్తాను. ముల్లోకాల్లో శ్రమైక జీవన సౌందర్యానికి సాటిలేదని చెపుతూ కార్మికులకు స్వస్తి వాక్యాలు పలుకుతాను. బంగారు వాద్యాలు మ్రోగిస్తాను. ఆర్తుల జీవితం పునాదిగా, భావి వేదాలు లోకానికి చవిచూపిస్తాను.
వేలకొలదీ వృత్తుల చిహ్నాలే, నేను పలికే కొత్త పాటకూ, కొత్త రీతికీ, భావం, భాగ్యం, ప్రాణం, ఓంకారం” అంటున్నాడు శ్రీశ్రీ.
ఆ) మీ పరిసరాల్లో ఉన్న కష్టజీవుల జీవన విధానాన్ని రాయండి.
(లేదా)
మీ పరిసరాల్లో ఉన్న ఎవరైనా ఇద్దరి కష్టజీవుల జీవన విధానాన్ని రాయండి.
జవాబు:
మా పరిసరాలలో చాలా మంది కష్టజీవులు ఉన్నారు. వారు ఉదయం వేకువజామునే లేచి తమతమ వృత్తులలోనికి వెళతారు. వారు ప్రతిరోజూ ఎటువంటి. అవరోధాలు వచ్చినా తమ బ్రతుకును వెళ్ళదీస్తుంటారు. వారిలో కొందరు ఆటోరిక్షాలు నడుపుతూ జీవిస్తారు. కొందరు అద్దె టాక్సీలు నడుపుతారు. కొందరు దుకాణాల్లో పనిచేస్తారు. వారి ఆడవాళ్ళు పాచిపని, అంట్లు తోమడం వగైరా పనులు చేసి జీవిస్తారు.
అందులో మగవారు పగలంతా కష్టపడి పని చేయడంవల్ల, ఆ శ్రమ పోతుందనే భ్రాంతితో తాగుడుకు అలవాటు, పడ్డారు. తాగి చిందులు తొక్కుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు తిండి తిప్పలు లేక, పస్తులు పడుకుంటారు. ఇందులో కొందరు పొరుగూరు వెళ్ళి వ్యవసాయం పనులు చేస్తారు. ఆ పనులు అన్ని రోజులూ ఉండవు. కాబట్టి పనులు దొరకని రోజుల్లో వీరికి జీవితం నడవడం కష్టమవుతోంది.
వీరి పిల్లలు చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారు. కొద్దిమంది కాన్వెంట్ లో చదువుతారు. అక్కడ ఫీజులు కట్టలేక బాధపడుతూ ఉంటారు. వీరు అప్పులు తెచ్చుకొంటూ ఉంటారు. అప్పులు ఇచ్చినవాళ్ళు బాకీ తీర్చలేని వార్ని తిడుతూ ఉంటారు. దాంతో తగవులు వస్తూ ఉంటాయి.
3. విత్తు నాటింది మొదలు పంట చేతికందే వరకు రైతు పడే కష్టాలు అనేకం. అటువంటి రైతుపడే కష్టాన్ని గురించి సొంత మాటల్లో రాయండి.
జవాబు:
విత్తు నాటింది మొదలు పంట చేతికందే వరకు రైతు పడే కష్టాలు ఇన్నీ అన్నీ అని చెప్పలేము. రైతు కష్టజీవి. విరామమంటే తెలియని శ్రామికుడు కర్షకుడు. నాగలిని నమ్ముకొని బతికేవాడు. పంట పొలాలకే తన జీవితాన్ని ధారపోసి పంటను పండిస్తాడు. చేను దున్ని, నీరు పెట్టి, నారుమళ్ళు పోసి, నారు తీసి, నాటు వేసి, ఎరువులు చల్లి, కోత కోసి, మోపులు కట్టి, కుప్పవేసి, పంట నూర్చి, తూర్పార పట్టి, బస్తాల కెత్తి, ధాన్యం బస్తాల కెత్తి ఇంటికి చేర్చి, అమ్మడం మొదలైన పనులు కర్షకుల శ్రమను తెలుపుతాయి.
అందుకే శ్రీ.శ్రీ. “ఆరుగాలం శ్రమించి భూమికి ధారపోసే కర్షక వీరుల శరీరంపై ప్రవహించే ఘర్మ జలానికి ఖరీదు కట్టలేమ”న్నాడు.
రైతు నాగలిని నమ్ముకొన్నాడు. పొలాలకే తన జీవితాన్ని ధారపోసి, భూమిలో బంగారు పంటలు పండించాలనీ కోరుకుంటున్నాడు. లోకమంతా సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే పొలాలను నాగళ్ళతో దున్నుతున్నాడు. విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నాడు.
IV పదజాలం
1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్ధాలు రాయండి. వాటిని సొంతవాక్యాల్లో ప్రయోగించండి.
అ) మనం కష్టపడితే గాని ఘర్మజలం విలువ తెలియదు.
జవాబు:
ఘర్మజలం = చెమట
పరుగు పెడితే శరీరం అంతా ఘర్మజలంతో నిండుతుంది.
ఆ) జీవులెన్నో ధరిత్రి మీద జీవిస్తున్నాయి.
జవాబు:
ధరిత్రి = భూమి
ఈ పుణ్యధరిత్రి ఎందరో మహామహులకు కన్నతల్లి.
ఇ) సీత హేమా భరణాలు ధరించింది.
జవాబు:
హేమం = బంగారు
ఇటీవల కాలంలో హేమం ధర చుక్కలనంటుతోంది.
ఈ) జలం తాగితేనే దాహం తీరుతుంది.
జవాబు:
జలం = నీరు
కృష్ణానదిలోని జలం మురికి అయిపోతున్నది.
2. కింది వాక్యాలు పరిశీలించండి.
అ) ఉగాది తెలుగువారి నూతన వర్మం.
ఆ) వర్షం పడుతుందని గొడుగు తీసుకువచ్చాను.
పై వాక్యాల్లో వర్షం అనే పదానికి సంవత్సరం, వాన అనే రెండు అర్థాలు ఉన్నట్లు తెలుస్తోంది కదా ! ఇలా ఒక మాటకు అనేక అర్థాలు వస్తే వాటిని నానార్థాలు అంటారు.
కింది పదాలకు నానార్థాలు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.
ఇ) భూతం :
జవాబు:
భూతం (నానార్థాలు) : పిశాచము, జరిగిపోయిన కాలం, ప్రాణి
వాక్యప్రయోగములు :
- నిన్ను బహుశః భూతం పట్టుకొంది. (పిశాచము)
- ఈ విషయము నేటిది కాదు భూతమునకు సంబంధించినది. (జరిగిపోయిన కాలం)
- పంచ భూతములలో వాయువు ముఖ్యమైనది.
ఈ) కరం :
జవాబు:
కరం : చెయ్యి, తొండము, మిక్కిలి, కిరణము
వాక్యప్రయోగములు :
- నీ కరములు మురికిగా ఉన్నాయి. (చేతులు) .
- ఏనుగు కరము సహాయంతో నీరు త్రాగుతుంది. (తొండము)
- సూర్య కరములు నేడు తీక్షణముగా ఉన్నాయి. (కిరణములు)
- వానికి తల్లిదండ్రులపై కరము ప్రియము. (మిక్కిలి)
3. కింది వాక్యాలను చదవండి.
బంగారం ధర బాగా పెరిగింది. అయినా ఆ పుత్తడి అంటే అందరికీ మక్కువే. కానీ మనసు బంగారమైతే ఈ స్వర్ణ మెందుకు?
పై వాక్యాల్లో బంగారం, పుత్తడి, స్వర్ణం అనే పదాలకు ఒకటే అర్థం అని గ్రహించారు కదా ! ఇలా ఒకే అర్థాన్నిచ్చే పదాలను పర్యాయపదాలు అంటారు. కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.
అ) హలం ఆ) జగం ఇ) జలం – ఈ) ధ్వని ఉ) అగ్ని
జవాబు:
అ) హలం : నాగలి, లాంగలము, సీరము
వాక్యప్రయోగములు :
- కర్షకుడు ఎప్పుడూ హలంను నమ్ముకుంటాడు.
- నాగలితో పొలమును దున్ని పంటలను పండిస్తాడు.
- రైతుకు అతిముఖ్యమైన పనిముట్టు సీరము.
- ఇప్పుడు రైతులు లాంగలముతో దున్నడం మాని, ట్రాక్టర్లతో పొలాలను దున్నుతున్నారు.
ఆ) జగం : లోకము, జగత్తు, భువనము
వాక్యప్రయోగములు :
- ఈ జగం అంతా మోసాల మయం.
- ఈ లోకములో దైవభక్తులు ఎందరో ఉన్నారు.
- ఈ జగత్తులో జిత్తులమారులు ఎక్కువయ్యారు.
- ఈ విశ్వములో చతుర్దశ భువనములూ ఉన్నాయి.
ఇ) జలం : నీరు, ఉదకము, తోయము
వాక్యప్రయోగములు :
- వేసవి రాగానే జలానికి కొరత ఏర్పడింది.
- ఎక్కువగా నీరు తాగితే ఆరోగ్యం బాగుంటుంది.
- గంగ ఉదకము మహాపవిత్రమైనది.
- నీవు పాలల్లో తోయము ఎక్కువగా కలుపుతున్నావు.
ఈ) ధ్వని : శబ్దము, చప్పుడు, నాదము, నినాదము
వాక్యప్రయోగములు :
- తరగతిలో పిల్లల ధ్వని వినబడడం లేదు.
- నీ మోటారు సైకిలు ఎక్కువ శబ్దము చేస్తోంది.
- నీవు చప్పుడు చేయకుండా కూర్చో.
- గాన విద్వాంసుని నాదము మారుమ్రోగుతోంది.
- కార్మికులు వ్యతిరేక నినాదములు ఇస్తున్నారు.
ఉ) అగ్ని : పావకుడు, వహ్ని, అనలము, దహనుడు
వాక్యప్రయోగములు :
- పంచభూతాలలో అగ్ని ఒకటి.
- ఇళ్ళన్నీ పావకుని విజృంభణంతో దగ్ధమయ్యాయి.
- వహ్ని శిఖలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
- అనిలుని ప్రేరేపణతో అనలము పెచ్చుమీరుతోంది.
- పొయ్యిలో దహనుడు మండకపోతే, వంట పూర్తి కాదు.
4. గీత గీసిన పదాలకు వికృతులు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.
అ) శారీరకమైన పనులు చేయడానికి శక్తి అవసరం.
ఆ) కష్టపడితే జీవితంలో మంచి ఫలితాలు పొందవచ్చు.
ఇ) ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది.
ఈ) ప్రాణమున్నంత వరకూ నిజాయితీగా బతకాలి.
జవాబు:
అ) ఆహారం మనకు సత్తి నిస్తుంది. శక్తి (ప్ర) – సత్తి (వి)
ఆ) ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో పేదల జీతాలు అతలాకుతలమవుతున్నాయి. జీవితం (ప్ర) – జీతం (వి)
ఇ) రాములవారి పాలనలో దమ్మం నాలుగుపాదాల నడిచింది. ధర్మం (ప్ర) – దమ్మం (వి)
ఈ) నేను పానం పోయినా అసత్యమాడను. ప్రాణము (ప్ర) – పానం (వి)
V. సృజనాత్మకత
* రైతు / కార్మికుడు ఏ విధంగా కష్టపడుతున్నారో తెలుసుకొని అతని జీవనశైలిని ఆత్మకథగా రాయండి.
జవాబు:
నేను చిన్నరైతుని. నా పేరు రామయ్య. నాకు రెండు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. నాకు పెళ్ళాం, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాకు పొలం మీద వచ్చే ఆదాయం ఏ మూలకూ చాలదు. నా పిల్లలను చదివించలేకపోతున్నా. మా ఆవిడికి సరైన బట్టలు కొనలేకపోతున్నా. కడుపునిండా సరిపడ తిండి లేదు.
పక్క రైతు దగ్గర 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయాయి. అప్పులు దొరకటల్లేదు. తెచ్చిన అప్పులు తీర్చలేకపోతున్నా. ఇల్లంతా వర్షం. నేయించుకోవడానికి డబ్బులు లేవు. పండిన ధాన్యం, కౌలు రైతుకు ఇచ్చాను. బాకీలు మిగిలాయి. నా పిల్లకూ, పిల్లవాడికీ పెళ్ళిళ్ళు చేయాలి. కట్నాలు ఇవ్వలేను. నా పిల్లవాడికి రైతుబిడ్డ అని, ఎవరూ పిల్లను ఇవ్వడంలేదు. కట్నం ఇవ్వలేనని మా పిల్లను ఎవరూ పెళ్ళి చేసుకోవడం లేదు.
రైతు గొప్పవాడని అందరూ అంటారు. చూస్తే నా బ్రతుకు ఇలా ఉంది. ఇవన్నీ చూశాక, నాతోటి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో అర్థం అవుతోంది. ప్రభుత్వమే మా రైతులను ఆదుకోవాలి.
(లేదా)
* తన కవితలో శ్రీశ్రీ కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి అనే వాటిని ఆయా వృత్తులకు చిహ్నాలుగా పేర్కొన్నారు. వీటిలో మీకు నచ్చిన వస్తువును ఎన్నుకొని చిత్రం గీయండి. దాన్ని గురించి రాయండి.
జవాబు:
ప్రక్క చిత్రంలో కుమ్మరి తన దగ్గర ఉన్న చక్రం(ఆవం)తో అందమైన కుండలను తయారుచేస్తున్నాడు. మొదట బంకమట్టి లేక ఎర్రమట్టిని తెచ్చి వాటిని బాగా కలిపి ముద్దగా చేస్తాడు. ఆ ముద్దను చక్రంపై పెట్టి తిప్పుతాడు. అప్పుడు ఆ మట్టిముద్ద అతని హస్తకళా నైపుణ్యంతో చక్కటి ఆకృతులను సంతరించుకుంటుంది. కుమ్మరి ఈ విధంగా కుండలు, ప్రమిదలు, పాలికలు, పూలకుండీలు మొదలగునవి తయారుచేస్తాడు. కానీ ప్రస్తుత కాలంలో ప్రజలు ఆధునిక పరికరాలు వాడకం వైపు మొగ్గు చూపుతుండటంతో కుమ్మరి జీవితం ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.
VI. ప్రశంస
* శ్రీశ్రీ కవితా శైలి ఎలాంటిది ? ఆయన చేసిన పద ప్రయోగం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
“ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం”
అని కొత్తగా గళమెత్తి సంచలనం రేకెత్తించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ అనే రెండక్షరాలు తెలుగు కవిత్వంలో విప్లవం సృష్టించాయి. కలం పేరు శ్రీశ్రీ కాగా, అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. “కష్టజీవి”కి ఇరువైపులా నిల్చేవాడే కవి అని కొత్త నిర్వచనం ఇచ్చిన కవి శ్రీశ్రీ. ఆకాశమార్గాన పయనించే తెలుగు కవితారథాన్ని భూమార్గం పట్టించి, భూకంపం పుట్టించి “అనితరసాధ్యం నా మార్గం” అని చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. భావకవిత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి అభ్యుదయ ఉద్యమానికి నాంది పలికాడు. ఆ తర్వాత విప్లవ కవిత్వోద్యమానికి స్ఫూర్తినిచ్చాడు.
కవితా శిల్పరచనలో ప్రవీణుడు శ్రీశ్రీ. ఈయన సారవంతమైన మహాభావ తరంగాల సంగమ స్థానము. శ్రీశ్రీ అక్షరాక్షర శిల్పి. ఈయన గేయరచనలో ఒక నవ్యత, పరాకాష్ట పొందిన లయ ఉన్నాయి. శ్రీశ్రీ యొక్క శబ్దాలంకారాలు, పదప్రయోగం విశిష్టమైనవి.
శ్రీశ్రీ కవితలో అంత్యానుప్రాసలు, అలవోకగా, అర్థవంతంగా సాగుతాయి. “హేమం పిండగ – సౌఖ్యం నిండగ”, “గనిలో, వనిలో, కార్యానాలో”, “పరిక్లమిస్తూ – పరిప్లవిస్తూ”, “విలాపాగ్నులకు – విషాదాశ్రులకు”, “బాటలు తీస్తూ – పాటలు వ్రాస్తూ”, “సంధానిస్తూ – సంరావిస్తూ”, “జాలరి పగ్గం – సాలెల మగ్గం”, “నా వినుతించే – నా విరుతించే, నా వినిపించే – నా విరచించే వంటి అనుప్రాసలు, పదప్రయోగం అర్థవంతంగా ఈ కవితలో ఉన్నాయి. అవి అద్భుతమైన లయతో, శ్రుతి మనోహరంగా ఉన్నాయి.
కార్మికుల శ్రమైక జీవన సౌందర్యానికి, వారి ఘర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడని శ్రీశ్రీ యథార్థాన్ని చెప్పాడు. శ్రీశ్రీ ఆవేశంగా చెప్పేటప్పుడు సంస్కృత సమాసబంధుర శబ్దాలు ప్రయోగిస్తాడు. స్వస్తి వాక్యములు సంధానిస్తూ, స్వర్ణ వాద్యములు సంరావిస్తూ, వ్యధార జీవిత యథార్ధ దృశ్యం, శ్రామిక లోకపు సౌభాగ్యానికి” వంటి సంస్కృత సమాసాలు అందుకు ఉదాహరణం.
శ్రీశ్రీ పదాలతో బంతులాటలాడతాడు. “దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ”, “త్రిలోకాలలో, త్రికాలాలలో,” “భావివేదముల, జీవనాదములు” వంటివి ఇందుకు ఉదాహరణలు.
శ్రీశ్రీ అన్యాయాలు, ఆకలి, వేదన, దరిద్రము పోయే మార్గంలో నవ్యకవిత్వం రాస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కార్మికుల వృత్తుల చిహ్నాలను తన కవితకు భావంగా, ప్రాణంగా, ప్రణవంగా స్వీకరించాడు.
సమాజాన్ని చైతన్యపరిచి, అభ్యుదయ కవిత్వానికి యుగకర్తగా వుండి, కొత్త తరానికి బాటలు వేసి, తనవాణిని జాతి జనులు పఠించే మంత్రంగా విరచించి, ప్రపంచ పీడిత జనానికి బాటసగా నిల్చి, వేమన, గురజాడల బాటలో నడిచి, తెలుగు కవిత్వంలో నిలువెత్తు సంతకంగా నిలిచిన శ్రీశ్రీ ప్రజాకవి. సమాజకవి.
(లేదా)
* మన గ్రామాల్లో, పట్టణాల్లో రకరకాల వృత్తుల వాళ్ళుంటారు. వాళ్ళంతా రెక్కల కష్టం మీద ఆధారపడ్డవాళ్ళే. వాళ్ళ దగ్గరకు వెళ్ళండి. తాము చేస్తున్న పనిలో వాళ్ళు పొందే ఆనందాన్ని గమనించండి. వాళ్ళను ప్రశంసించండి. వాళ్ళను ఏ విధంగా అభినందించారో రాయండి.
జవాబు:
వృత్తి పని చేసే పెద్దలారా ! మీరు నిజంగా మన సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. మీకు ఈ వృత్తుల వల్ల వచ్చే సంపాదన మీ భార్యాబిడ్డలను పోషించడానికి సరిపోదు. అయినా మీరు మీ కులవృత్తులను కొనసాగిస్తున్నారు. గ్రామ, నగర సంస్కృతిని మీరు రక్షిస్తున్నారు.
మీ వడ్రంగులు వారి పని చేయకపోతే, ఇళ్ళకు తలుపులు, కిటికిలూ లేవు. మీ తాపీవారు ఇళ్ళు కట్టకపోతే, మాకు ఇళ్ళే లేవు. మీ రైతులు పంటలు పండించకపోతే మాకు తిండి లేదు.
మీ కమ్మర్లు కత్తులు, కొడవళ్ళు చేయకపోతే మాకు ఆ సాధనాలే ఉండేవి కావు. మీ కుమ్మర్లు ప్రమిదలు, కుండలు, పాలికలు తయారుచేయకపోతే దీపావళికి దీపాలు లేవు. పెళ్ళిళ్ళలో అయిరేణికుండలు లేవు. అంకురార్పణలకు పాలికలు లేవు.
మీరు కడుపులు మాడ్చుకుని, అర్ధాకలితో మీ తోటివారికి సాయం చేస్తున్నారు. మీకు నా అభినందనలు. మీరు మన దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు. పెద్దలారా ! సెలవు.
ప్రాజెక్టు పని
* శ్రీశ్రీ రాసిన కవితలను / గీతాలను సేకరించండి.
వాటిలో ఏదైనా ఒకదాన్ని రాసి రాగ భావయుక్తంగా పాడి వినిపించండి
జవాబు:
శ్రీశ్రీ గేయము :
మహాప్రస్థానం
1. మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరో ప్రపంచం పిలిచింది
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి
2. కదం తొక్కుతూ
పదం పాడుతూ
హృదంతరాళం గర్జిస్తూ
పదండి పోదాం
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం
3. దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు
బాటలు నడచీ
పేటలు కడచీ
కోటలన్నిటిని దాటండి
నదీనదాలూ
అడవులు, కొండలు,
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి
4. ఎముకలు క్రుళ్ళిన
వయస్సు మళ్ళిన
సోమరులారా ! చావండి
నెత్తురు మండే
శక్తులు నిండే
సైనికులారా ! రారండి
హరోం హరోం హర
హరహర హరహర
హరహర హరహర
హరోం హరా అని కదలండి
మరో ప్రపంచం,
మహా ప్రపంచం
ధరిత్రి నిండా నిండింది.
VII. భాషను గురించి తెలుసుకుందాం
1) కింది పదాలను విడదీసి, సంధుల పేర్లను రాయండి.
అ) విరామమెరుగక = విరామము + ఎరుగక – ఉత్వసంధి
ఆ) జగానికంతా = జగానికి + అంతా – ఇకారసంధి
ఇ) విలాపాగ్నులు = విలాప + అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి
ఈ) అనేకులింకా = అనేకులు + ఇంకా = ఉత్వసంధి
ఉ) విషాదాశ్రువులు = విషాద + అశ్రువులు = సవర్ణదీర్ఘ సంధి
2) కింది విగ్రహవాక్యాలను సమాసపదాలుగా కూర్చండి. సమాసాల పేర్లను రాయండి.
అ) ముగ్గురైన దేవతలు = ముగ్గురు దేవతలు – ద్విగు సమాసం
ఆ) రెండైన గంటలు = రెండు గంటలు – ద్విగు సమాసం
3) కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి. ఏ సమాసమో రాసి కారణాలు చర్చించండి.
అ) నాలుగు వేదాలు = నాలుగైన వేదాలు – ద్విగు సమాసం
ఆ) రెండు చేతులు = రెండైన చేతులు – ద్విగు సమాసం
ఇ) త్రికరణాలు = మూడైన కరణాలు – ద్విగు సమాసం
ఈ) కోటిరత్నాలు = కోటి సంఖ్య గల రత్నాలు – ద్విగు సమాసం
ఉ) ముప్ఫైరోజులు = ముప్ఫై అయిన రోజులు – ద్విగు సమాసం
ఊ) మూడు జిల్లాలు = మూడైన జిల్లాలు – ద్విగు సమాసం
ఋ) నూరుపద్యాలు = నూరైన పద్యాలు – ద్విగు సమాసం
పైన తెలిపిన విగ్రహవాక్యాలకు అన్నింటికి సంఖ్యావాచక విశేషణాలు పూర్వపదంలో ఉన్నాయి. కాబట్టి వీటిని ద్విగు సమాసాలు అంటారు.
4) ఈ కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) రుకియా బజారుకు వెళ్ళింది. రుకియా కూరగాయలు కొన్నది.
జవాబు:
రుకియా బజారుకి వెళ్ళి, కూరగాయలు కొన్నది.
ఆ) కృష్ణ బొబ్బిలి వెళ్ళాడు. కృష్ణ ఇల్లు కట్టాడు.
జవాబు:
కృష్ణ బొబ్బిలి వెళ్ళి, ఇల్లు కట్టాడు.
ఇ) తాతగారు ఇంటికి వచ్చారు. తాతగారు కాఫీ తాగారు.
జవాబు:
తాతగారు ఇంటికి వచ్చి, కాఫీ తాగారు.
ఈ) మాధురి తోటకి వెళ్ళింది. మాధురి పువ్వులు కోసింది.
జవాబు:
మాధురి తోటకి వెళ్ళి, పువ్వులు కోసింది.
ఉ) చిన్నా సినిమాకి వెళ్ళాడు. చిన్నా ఐస్ క్రీమ్ తిన్నాడు.
జవాబు:
చిన్నా సినిమాకి వెళ్ళి, ఐస్ క్రీమ్ తిన్నాడు.
5) కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
అ) ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా ? ఆజాద్ డేవిడ్ కంటే చిన్నవాడా?
జవాబు:
ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా? చిన్నవాడా?
ఆ) జయ ఇంటికి వెళ్ళింది. విజయ బడికి వెళ్ళింది.
జవాబు:
జయ ఇంటికి, విజయ బడికి వెళ్ళారు.
ఇ) స్వప్న అన్నం తిన్నది. పద్మ పండ్లు తిన్నది.
జవాబు:
స్వప్న అన్నం, పద్మ పండ్లు తిన్నారు.
ఈ) రమ అందమైనది. రమ తెలివైనది.
జవాబు:
రమ అందమైనదీ, తెలివైనది.
ఉ) పావని సంగీతం నేర్చుకుంది. పావని నృత్యం నేర్చుకుంది.
జవాబు:
పావని సంగీతమూ, నృత్యమూ నేర్చుకుంది.
ఊ) రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
జవాబు:
రైలు వచ్చింది కాని చుట్టాలు రాలేదు.
6) కింది పేరా చదవండి. సామాన్య, సంక్లిష్ట, సంయుక్త వాక్యాలను గుర్తించండి. రాయండి.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పశ్చిమబెంగాల్ లో జన్మించాడు. ఈయన సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషలు నేర్చుకున్నారు. చదువు పూర్తయింది. ఈశ్వరచంద్రుడు ఉద్యోగంలో చేరాడు. ఈయన ప్రధానోపాధ్యాయునిగా, ప్రత్యేక తనిఖీ అధికారిగా పనిచేశాడు. ఈ ఉద్యోగం అతనికి రుచించలేదు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి, అనేక బాలికా పాఠశాలలు స్థాపించాడు. వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. అంతేగాక తన కుమారునికి ఒక వితంతువుతో వివాహం జరిపించి, సభ్య సమాజానికి ఆదర్శప్రాయుడయ్యాడు.
సామాన్య వాక్యాలు :
- ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పశ్చిమ బెంగాల్ లో జన్మించాడు.
- విద్య పూర్తయింది.
- ఈశ్వరచంద్రుడు ఉద్యోగంలో చేరాడు.
- ఈ ఉద్యోగం అతనికి రుచించలేదు.
- ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
- వితంతు వివాహాలు ప్రోత్సహించాడు.
సంక్లిష్ట వాక్యాలు :
- స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి, అనేక బాలికా పాఠశాలలను స్థాపించాడు.
- అంతేగాక తన కుమారునికి ఒక వితంతువుతో వివాహం జరిపించి, సభ్య సమాజానికి ఆదర్శప్రాయుడైనాడు.
సంయుక్త వాక్యాలు :
- ఈయన సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషలు నేర్చుకున్నాడు.
- ఈయన ప్రధానోపాధ్యాయునిగా, ప్రత్యేక తనిఖీ అధికారిగా పనిచేశాడు.
7) గసడదవాదేశ సంధి :
అ) కింది పదాలను ఏ విధంగా విడదీశారో గమనించండి.
గొప్పవాడుగదా = గొప్పవాడు + కదా (డు + క)
కొలువుసేసి = కొలువు + చేసి (వు + చే)
వాడుడక్కరి = వాడు + టక్కరి (డు + ట)
నిజముదెలిసి = నిజము + తెలిసి (ము + తె)
పొలువోయక = పాలు + పోయక (లు + పో)
పై ఉదాహరణలు గమనించారు కదా ! పూర్వపదం చివర ప్రథమావిభక్తి ప్రత్యయాలున్నాయి. పరపదం మొదట క, చ, ట, త, ప లున్నాయి. ఈ విధంగా ప్రథమావిభక్తి మీది ప్రత్యయాలకు క, చ, ట, త, పలు పరమైతే వాటిస్థానంలో గ, స, డ, ద, వలు ఆదేశంగా వస్తాయి. అంటే –
క → ‘గ’ గా మారుతుంది
చ → ‘స’ గా మారుతుంది
ట → ‘డ’ గా మారుతుంది
త → ‘ద’ గా మారుతుంది
ప → ‘వ’ గా మారుతుంది.
(క చ ట త ప లకు గ స డ ద వలు ఆదేశంగా వస్తాయి.)
పాలు
కింది పదాలను విడదీసి రాయండి. వివరించండి.
అ) నిక్కముదప్పదు
నిక్కము + తప్పదు = నిక్కము దప్పదు (ము + త)
పూర్వ పదం చివర ‘ము’ అనే ప్రథమావిభక్తి ప్రత్యయము ఉన్నది. పరపదము మొదట ‘త’ అనేది పరమైనపుడు ‘ద’ అనే పదం వచ్చింది. త, దగా మారింది.
ఆ) ప్రాణములుగల్లి – ప్రాణములు + కల్గి
ఇ) పొడగానరాక – పొడ + కానరాక
ఈ) నోరసూపు – నోరు + చూపు
ఉ) నీరుద్రావి – నీరు + త్రావి
ఊ) పాలుదాగి + తాగి
ద్వంద్వ సమాస పదాల విషయంలో కూడా గసడదవాదేశసంధి కనిపిస్తుంది.
ఆ) కింది పదాలను గమనించండి.
కూరగాయలు = కూర + కాయ + లు
కాలుసేతులు = కాలు + చేయి → చేతు + లు
టక్కుడెక్కులు టక్కు + టెక్కు + లు
తల్లిదండ్రులు = తల్లి + తండ్రి + లు
ఊరువల్లెలు = ఊరు + పల్లె + లు
పై పదాలు ద్వంద్వ సమాసానికి ఉదాహరణలు.
ద్వంద్వ సమాసంలో కూర + కాయ అన్నప్పుడు ‘క’ స్థానంలో ‘గ’ వచ్చింది. ఈ విధంగా కచటతపలకు, గసడదవలు రావడాన్నే గసడదవాదేశం అంటారు. సూత్రం : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచటతపలకు గసడదవలు క్రమంగా వస్తాయి. కింది పదాలను కలపండి.
అ) అక్క + చెల్లెలు = అక్కాచెల్లెలు
ఆ) అన్న + తమ్ముడు = అన్నాదమ్ములు
8. తత్పురుష సమాసం :
అ) కింది పదాలు చదవండి. వాటికి విగ్రహవాక్యాలు చూడండి.
అ) రాజభటుడు
ఆ) తిండిగింజలు
ఇ) పాపభీతి
‘రాజభటుడు’ లో ‘రాజు’ పూర్వపదం, “భటుడు” ఉత్తరపదం. అట్లే తిండిగింజలు – తిండి కొఱకు గింజలు – ‘తిండి’ పూర్వపదం ‘గింజలు’ ఉత్తరపదం. పాపభీతి – పాపం వల్ల భీతి – ‘పాపం’ పూర్వపదం, ‘భీతి’ ఉత్తర పదం.
రాజభటుడుకు విగ్రహవాక్యం రాస్తే ‘రాజు యొక్క భటుడు’ అవుతుంది. దీంట్లో ‘యొక్క’ అనేది షష్ఠీవిభక్తి ప్రత్యయం. భటుడు రాజుకు చెందినవాడని చెప్పడానికి షష్ఠీవిభక్తి ప్రత్యయాన్ని వాడాం. ఇలా విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు.
పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసాలు :
తత్పురుష సమాసం రకాలు | విభక్తులు | ఉదాహరణ |
ప్రథమా తత్పురుష సమాసం | డు,ము,వు, లు | మధ్యాహ్నం – అహ్నము మధ్య భాగం |
ద్వితీయా తత్పురుష సమాసం | ని,ను,ల,కూర్చి, గుఱించి | జలధరము – జలమును ధరించినది |
తృతీయా తత్పురుష సమాసం | చేత,చే, తోడ,తో | బుద్ధిహీనుడు – బుద్ధిచేత హీనుడు |
చతుర్టీ తత్పురుష సమాసం | కొఱకు, కై | వంటకట్టెలు వంట కొఱకు కట్టెలు |
పంచమీ తత్పురుష సమాసం | వలన, కంటె, పట్టి | దొంగభయం – దొంగ వలన భయం |
షష్ఠీ తత్పురుష సమాసం | కి,కు, యొక్కలో, లోపల | రామబాణం – రాముని యొక్క బాణం |
సప్తమీ తత్పురుష సమాసం | అందు,న | దేశభక్తి – దేశమునందు భక్తి |
నఞ్ తత్పురుష సమాసం | నఞ్ అంటే వ్యతిరేకార్థం | అసత్యం – సత్యం కానిది |
ఆ) కింది పదాలు చదవండి. విగ్రహవాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో రాయండి.
అ) రాజపూజితుడు = రాజు చేత పూజితుడు (తృతీయా తత్పురుషం)
ఆ) ధనాశ = ధనము నందు ఆశ (సప్తమీ తత్పురుషం)
ఇ) పురజనులు = పురము నందలి జనులు (సప్తమీ తత్పురుషం)
ఈ) జటాధారి = జడలను ధరించువాడు (ద్వితీయా తత్పురుషం)
ఉ) భుజబలం = భుజము యొక్క బలం (షష్ఠీ తత్పురుషం)
ఊ) అగ్నిభయం = అగ్ని వలన భయం (పంచమీ తత్పురుషం)
ఋ) అన్యాయం న్యాయం కానిది. (నః తత్పురుషం)
వ్యాకరణంపై అదనపు సమాచారం
పర్యాయపదాలు
బాట : దారి, మార్గం, పథం
స్వామి : ప్రభువు, దొర, యజమాని
కళ్యాణం : పెండ్లి, పరిణయం, ఉద్వాహం
హేమం : బంగారం, సువర్ణం, కాంచనం
జగం : లోకం, ప్రపంచం
ఖరీదు : మూల్యం , వెల
పాట : గీతం, గేయం
కాయం : శరీరం, దేహం, తనువు, మేను
దాస్యం : సేవ, ఊడిగం
ఇల : భూమి, ధరిత్రి, ధరణి
వ్యుత్పత్యర్థాలు
ధర్మము – ధరించబడేది.
అశ్రువులు – దుఃఖంతో కన్నుల నుండి కారే నీరు
నానార్థాలు
బలం – తావు, సామర్థ్యం, శక్యం
కాలం – సమయం, మరణం
భాగ్యం – అదృష్టం, సంపద
వర్షం – వాన, సంవత్సరం
సంధులు
సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును.
విలాపాగ్నులు = విలాప + అగ్నులు – సవర్ణదీర్ఘ సంధి
విషాదాశ్రువులు = విషాద + అశ్రువులు – సవర్ణదీర్ఘ సంధి
వృధార్తి = వృధ + ఆర్తి – సవర్ణదీర్ఘ సంధి
వృద్ధి సంధి
సూత్రం : ఆకారమునకు ఏ, ఐ లు పరమగునుపుడు ‘ఐ’ కారమును; ఓ, ఔలు పరమగునపుడు ‘ఔ కారమును ఏకాదేశమగును.
శ్రమైక – శ్రమ + ఏక – వృద్ధి సంధి
ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి యగును.
సమానమైనది = సమానము + ఐనది – ఉత్వసంధి
జగత్తు అంతా = జగత్తుకు + అంతా – ఉత్వసంధి
చవులిస్తాను = చవులు + ఇస్తాను – ఉత్వసంధి
విరామమెరుగక = విరామము + ఎరుగక – ఉత్వసంధి
ఇత్వసంథి
సూత్రం : మధ్యమ పురుష క్రియలయందు ఇత్తునకు సంధియగు.
జగానికంత = జగానికి + అంతా – ఇత్వసంధి
వర్ధిల్లాలని = వర్ధిల్లాలి + అని – ఇత్వసంధి
సమాసాలు
సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
విషాదాశ్రువులు | విషాదం అనే అశ్రువులు | రూపక సమాసం |
విలాపాగ్నులు | విలాపం అనెడి అగ్నులు | రూపక సమాసం |
యంత్రభూతములు | యంత్రములు అనెడి భూతములు | రూపక సమాసం |
ఘర్మజలము | ఘర్మము అనెడి జలము | రూపక సమాసం |
సహస్రవృత్తులు | సహస్త్ర సంఖ్య గల వృత్తులు | ద్విగు సమాసం |
నరాల బిగువు | నరాల యొక్క బిగువు | షష్ఠీ తత్పురుష సమాసం |
కరాల నృత్యం | కరాల యొక్క నృత్యం | షష్ఠీ తత్పురుష సమాసం |
కుమ్మరి చక్రం | కుమ్మరి యొక్క చక్రం | షష్ఠీ తత్పురుష సమాసం |
సాలె మగ్గం | సాలెల యొక్క మగ్గం | షష్ఠీ తత్పురుష సమాసం |
కార్మిక లోకం | కార్మికుల యొక్క లోకం | షష్ఠీ తత్పురుష సమాసం |
వ్యధార్తి | వ్యధతో ఆర్తి | తృతీయా తత్పురుష సమాసం |
నవ్యకవిత్వం | నవ్యమైన కవిత్వం | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
భావివేదం | భావియైన వేదం | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
సమస్త చిహ్నాలు | సమస్తమైన చిహ్నాలు | విశేషణ పూర్వనద కర్మధారయ సమాసం |
నవీన గీతి | నవీనమైన గీతి | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
నవీనరీతి | నవీనమైన రీతి | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
జీవన సౌందర్యం | జీవనమందలి సౌందర్యం | సప్తమీ తత్పురుష సమాసం |
ప్రకృతి – వికృతులు
కష్టం – కస్తి
ప్రాణం – పానం
భాగ్యము – బాగెము
మంత్రం – జంత్రము
ఆకాశం – ఆకసం
అగ్ని – అగ్గి
రత్నము – రతనము
ప్రతిజ్ఞ – ప్రతిన
శ్రీ – సిరి
ధర్మము – దమ్మము
కవి పరిచయం
పూర్తి పేరు : శ్రీరంగం శ్రీనివాసరావు
జననం : 1910 వ సం||
జన్మస్థలం : విశాఖపట్టణం
తొలి రచన : పద్దెనిమిదేళ్ళ నాటికే “ప్రభవ” అనే భావకవితా సంపుటి.
మహాకవిగా : ఈయన రచించిన అభ్యుదయ కవితా సంపుటి ‘మహాప్రస్థానం’తో మహాకవి అయ్యారు.
విప్లవకవిగా : ఖడ్గసృష్టి, మరోప్రస్థానం గీతాలు రాశారు.
ఇతర రచనలు : మూడు యాభైలు పేరిట వ్యంగ్య కవితలు, కార్టూను కవితలు, 1+1= 1 లేక డిసెంబరు 31, 1999 పేరిట రేడియో నాటికలు.
రచనా శైలి : ‘చరమరాత్రి’ కథల ద్వారా చైతన్య స్రవంతి పద్ధతిని తెలుగు రచనలో ప్రవేశపెట్టారు. సృజనకు, ప్రతిభకు, తాత్త్విక మార్గాన్వేషణకు పేరుగన్నవాడు. నూతన పదప్రయోగాల మార్గదర్శకుడు.
కవితా వస్తువులు : కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలే శ్రీశ్రీ కవితావస్తువులు.
మరణం : 15-6-1983 వ సంవత్సరం
గేయాలు- అర్ధాలు- భావాలు
1వ గేయం
పొలాల నన్నీ,
హలాల దున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం. ధరిత్రికి బలి కావించే,
కర్షకవీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి,
ఘర్మజలానికి,
ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్ !
అర్థాలు :
పొలాల నన్నీ = అన్ని పొలాలనూ ; (భూములనూ)
హలాల దున్నీ = నాగళ్ళతో దున్ని
ఇలా, తలంలో = భూమి ప్రదేశంలో (భూమిపై)
హేమం, పిండగ = బంగారాన్ని పిండడానికి (బంగారు పంటలు పండించడానికి)
జగానికంతా = లోకాని కంతా
సౌఖ్యం నిండగ = నిండుగా సౌఖ్యం కలగడానికి
విరామ మెరుగక = విశ్రాంతి లేకుండా
పరిశ్రమించే = ఎక్కువగా శ్రమించి అలసిపోయే
బలం ధరిత్రికి = తన బలాన్ని భూమికి (ధారపోసే)
బలి కావించే = బలి ఇచ్చే
కర్షకవీరుల = రైతు వీరుల
కాయం నిండా = శరీరం నిండా
కాలువకట్టే = కాలువలా ప్రవహించే
ఘర్మజలానికి = చెమటకు
ఘర్మజలానికి = చెమట నీటికి
ఖరీదు లేదోయ్ – విలువ కట్టలేము
భావం :
విరామమే తెలియని కష్టజీవి రైతన్న. ప్రపంచమంతా సుఖంగా ఉండాలని కోరేవాడు అతను. నాగలిని నమ్ముకొని జీవించే కష్టజీవి. పొలాలకు జీవితాన్ని ధారపోసి బంగారాన్ని పండిస్తాడు. ఈ రైతు శరీరమంతటినుంచి అంతటా స్రవించే చెమట ధర్మజలం. ఆ ధర్మజలానికి ఖరీదు కట్టలేము.
2వ గేయం
నరాల బిగువూ,
కరాల సత్తువ
వరాలవర్షం కురిపించాలని,
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని –
గనిలో, వనిలో, కార్ఖానాలో
పరిక్లమిస్తూ,
పరిప్లవిస్తూ,
ధనికస్వామికి దాస్యం చేసే,
యంత్రభూతముల కోరలు తోమే,
కార్మికవీరుల కన్నుల నిండా
కణకణ మండే,
గలగల తొణకే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదుకట్టే షరాబు లేడోయ్ !
అర్థాలు :
నరాల బిగువూ = (తన) నరముల బింకాన్నీ (సత్తువను)
కరాల సత్తువ = (తన) చేతుల బలమునూ
వరాలవర్షం కురిపించాలని = వరహాలు వర్షంగా కురిపించాలని (సిరులు కురిపించాలని)
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని = (తాను పండించిన పంటలతో) ప్రపంచంలో ఐశ్వర్యం వృద్ధి చెందాలని
గనిలో = గనులలో
వనిలో = అడవులలో
కార్ఖానాలో = కర్మాగారాలలో
పరిక్లమిస్తూ – ఎక్కువగా శ్రమిస్తూ
పరిప్లవిస్తూ = తేలియాడుతూ (గంతులు వేస్తూ) (పనిలో గాఢంగా నిమగ్నమవుతూ)
ధనికస్వామికి = ధనవంతుడైన యజమానికి
దాస్యం చేసే = బానిసత్వాన్ని చేసే
యంత్రభూతముల = దయ్యాలవంటి పరిశ్రమలలోని యంత్రముల
కోరలు తోమే = పళ్ళు తోమే (యంత్రముల మధ్య పనిచేసే)
కార్మిక వీరుల = వీరులైన కార్మికుల
కన్నుల నిండా = కండ్ల నిండుగా
కణకణ మండే = నిప్పుల్లా కణ కణమని మండే
విలాపాగ్నులకు (విలాప + అగ్నులకు) = దుఃఖముతో కూడిన మాటలనే అగ్నులకు
విషాదాశ్రులకు (విషాద + అశ్రులకు) = దుఃఖపుకన్నీళ్ళకు
ఖరీదు కట్టే = విలువను నిర్ణయింప గల
షరాబు లేడోయ్ = బంగారపు వ్యాపారి లేడు
భావం :
కార్మికుడు ఎప్పుడూ ప్రపంచమంతా సంపదలతో తులతూగాలని కోరుకుంటాడు. దానికోసం తన శక్తినంతా పణంగా పెడుతున్నాడు. గనులలో కాని, అడవులలో కాని, కర్మాగారాలలో కాని అడుగడుగునా యజమానులకు సేవ చేయటానికి అంకితము అవుతున్నాడు. కార్మికుని జీవితం యంత్రాలలో చిక్కుకుపోయింది. కార్మిక వీరుల కష్టసుఖాలలో పాలు పంచుకునేవారు ఎవరూ లేరు. కార్మికుని దుఃఖానికి, అగ్నిగోళాల వంటి కళ్ళనుండి కారుతున్న కన్నీటికి ఖరీదు కట్టలేము.
3వ గేయం
కావున – లోకపుటన్యాయాలూ,
కాల్చే ఆకలి, కూల్చే వేదన,
దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ
పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ, పాటలు వ్రాస్తూ
నాలో కదలే నవ్యకవిత్వం
కార్మికలోకపు కళ్యాణానికి,
శ్రామికలోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా, సమర్చనంగా
త్రిలోకాలలో, త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనేలేదని
అర్ధాలు :
కావున = కాబట్టి
లోకపుటన్యాయాలు (లోకము + అన్యాయాలు) = లోకంలో జరిగే అన్యాయాలు
కాల్చే ఆకలి = కడుపును మండించే ఆకలి
గలగల తొణకే – గల గల మని ధ్వని చేస్తూ పొంగే
కూల్చే వేదన = మనిషిని పడగొట్టే మానసిక బాధ
దారిద్య్రాలూ – దరిద్రములూ
దౌర్జన్యాలూ = దుర్మార్గాలూ
పరిష్కరించే = చక్కపెట్టే (పోగొట్టే)
బహిష్కరించే = వెలివేసే (పై చెప్పిన అన్యాయాలను దూరం చేసే)
బాటలు తీస్తూ = దారులు తొక్కుతూ
పాటలు వ్రాస్తూ = గేయాలు రాస్తూ
నాలో కదలే నవ్య కవిత్వం = నాలో నుండి వచ్చే కొత్త కవిత్వం
కార్మికలోకము + కల్యాణానికి = కార్మికుల శుభానికి
శ్రామికలోకము + సౌభాగ్యానికి = శ్రమించే రైతుల, కార్మికుల, పనివారల, మంగళానికి (వైభవానికి)
సమర్పణంగా = భక్తితో అర్పించడానికి
సమర్చనంగా = విశేషమైన పూజగా అందించడానికి
త్రిలోకాలలో = మూల్లోకాలలో (స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలలో)
త్రికాలలో = భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో
శ్రమైక జీవన సౌందర్యానికి = శ్రమించి బ్రతకడంలో గల అందానికి
సమానమైనది = సమానమైనది
లేనేలేదని = లేదని
భావం :
“ఈ లోకంలో జరిగే అన్యాయాలను, ఆకలిని వేదనను, దారిద్ర్యాన్ని, దౌర్జన్యాలను నిరసిస్తున్నాను. వాటిని పరిష్కరించాలని, బహిష్కరించాలని ఈ పాటలను రాస్తున్నాను. నాలో కదిలేది కొత్త కవితావేశం. ఇది కార్మికుల కళ్యాణానికి, శ్రామికుల సౌభాగ్యానికి అంకితం. ఎందుకంటే ముల్లోకాలలో ఈ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదు.” అని శ్రీశ్రీ చెప్పాడు.
4వ గేయం
కష్టజీవులకు కర్మ వీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ,
స్వస్తివాక్యములు సంధానిస్తూ,
స్వర్ణవాద్యములు సంరావిస్తూ –
వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం
భావివేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్ !
అర్థాలు :
కష్టజీవులకు = కష్టపడి జీవించే రైతులకూ, కార్మికులకూ, చేతివృత్తుల వారికీ
కర్మవీరులకు = కష్టపడి పట్టుదలతో పని చేసేవారికి
నిత్యమంగళం = నిత్యమూ శుభాన్ని
నిర్దేశిస్తూ = చూపిస్తూ
స్వస్తి వాక్యములు = మంగళ వాక్యములు (శుభము కలగాలని ఆశీర్వదించే వాక్యములు)
సంధానిస్తూ = కూరుస్తూ
స్వర్ణవాద్యములు = బంగారు వాయిద్యములు
సంరావిస్తూ = మ్రోగిస్తూ
వ్యధార జీవిత (వ్యధా + ఆర్త, జీవిత) = బాధచే పీడింపబడిన జీవితము యొక్క
యథార్థ దృశ్యం = నిజమైన దృశ్యము
పునాదిగా = మూలంగా
జనించబోయే = పుట్టబోయే
భావివేదముల = రాబోయే కాలంలోని వేదాల
జీవనాదములు = జీవధ్వనులు
జగత్తుకంతా = ప్రపంచానికంతా
చవులిస్తానోయ్ = రుచి చూపిస్తాను
భావం :
బంగారు వాద్యాలతో, స్వస్తి మంత్రాలతో, కష్ట జీవులకూ, కర్మవీరులకూ హారతులిస్తాను. శ్రామికుల బాధలు కళ్ళకు కట్టినట్లుగా రాబోయే తరాలవారికి చెప్తాను. నా మాటలు భావిభారత తరాలకు వేదాలు, జీవనాదాలు అంటాడు శ్రీశ్రీ.
5వ గేయం
కమ్మరి కొలిమి, కుమ్మరిచక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్ఫురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్ర వృత్తుల, సమస్త చిహ్నలు-
నా వినుతించే పునాదిగా ఇక జనించబోయే
నా విరుతించే,
నా వినిపించే నవీనగీతికి,
నా విరచించే నవీనరీతికి,
భావం
భాగ్యం !
ప్రాణం !
ప్రణవం !
అర్థాలు :
కమ్మరి కొలిమి = ఇనుప పనిచేసే కమ్మరివాని కొలిమి (నిప్పు గుంట)
కుమ్మరి చక్రం = కుమ్మరి కుండల తయారీకి వాడే చక్రం
జాలరి పగ్గం = చేపలు పట్టేవాని వలతాడు
సాలెల మగ్గం = బట్టలు నేసేవాని మగ్గం
శరీర కష్టం స్ఫురింపజేసే = శరీర కష్టాన్ని తెలిపే
గొడ్డలి, రంపం = గొడ్డలి, రంపం
కొడవలి, నాగలి = కొడవలి, నాగలి వంటి
సహస్ర వృత్తుల = వేలకొలదీ వృత్తి పనివారల
సమస్త చిహ్నాలు = అన్ని గుర్తులూ
నా వినుతించే = నేను కొనియాడే
నా విరుతించే – నేను ధ్వనించే
నా వినిపించే నవీనగీతికి = నేను వినిపించే కొత్త పాటకు
నా విరచించే : నేను రచించే
నవీన రీతికి = కొత్త పద్ధతికి
భావం = భావము
భాగ్యం = భాగ్యము
ప్రాణం = ప్రాణము
ప్రణవం = ఓంకార నాదము
భావం :
ఈ దేశంలో శరీర కష్టం చేసేవారు చాలామంది ఉన్నారు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి మొదలైన పనిముట్లు వివిధ వృత్తులకు గుర్తులు. ఆ గుర్తులే నా కవితా వస్తువులు. నేను వారి కొరకే గీతాలు రాస్తాను. ఆ శ్రామికులు, కార్మికులు నా కవిత్వంలో నాయకులు. అదే భావం, భాగ్యం, నా కవితకు ప్రాణం, ఓంకారం.
AP Board Textbook Solutions PDF for Class 8th Telugu
- AP Board Class 8 Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 1 అమ్మకోసం Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 3 నీతి పరిమళాలు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 4 అజంతా చిత్రాలు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 5 ప్రతిజ్ఞ Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 6 ప్రకృతి ఒడిలో Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 7 హరిశ్చంద్రుడు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 8 జీవన భాష్యం Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 9 సందేశం Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 10 సంస్కరణ Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Chapter 11 భూదానం Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu ఉపవాచకం Chapter 2 గుశ్వం Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu వ్యాసాలు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu లేఖలు Textbook Solutions PDF
- AP Board Class 8 Telugu Grammar Textbook Solutions PDF
0 Comments:
Post a Comment